9 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని పట్టుకున్న యువత, సీపీ సజ్జనార్ సన్మానం

Wait 5 sec.

పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి.. 9 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ సంఘటనను చూసిన ఓ యువతి, పలువురు యువకులు.. మాకెందుకు లే అని ఊరుకోకుండా వెళ్లి అడ్డుకున్నారు. అంతేకాకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ధైర్యంతో వారు ఆ బాలికను ఆ కామాంధుడి నుంచి రక్షించారు. తాజాగా ఆ బాలికను రక్షించిన సాహసవంతులకు హైదరాబాద్ సీపీ వీసీ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడూ ఒక పోలీస్‌గా మారాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనెల 14వ తేదీన సెజల్ అనే యువతి తన ఫ్రెండ్ గణపతితో కలిసి యూసుఫ్‌గూడ నుంచి మాదాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 దగ్గర ఒక వ్యక్తి ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గమనించారు. అదే సమయంలో ఆ చిన్నారి కళ్లలో భయాన్ని చూసి వారు చలించిపోయారు. తక్షణమే స్పందించి అటుగా వెళ్తున్న కాశీనాథ్, నారాయణల సాయంతో ఆ నిందితుడిని అడ్డుకున్నారు. అతడి చెర నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా.. డయల్ 100కు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు పట్టించారు.పోలీసుల విచారణలో నిందితుడు యూసఫ్ గూడకు చెందిన జావీద్ అని తేలింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా.. ఆ సమయంలో గుర్తించిన జావీద్.. ఐస్‌క్రీమ్ కొనిస్తానని మభ్యపెట్టి తన బైక్‌పై తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నిర్ధారించారు. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.ఈ నేపథ్యంలోనే బాలికను రక్షించిన సెజల్, గణపతి, కాశీనాథ్‌లను బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సీపీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డును కూడా అందజేశారు. సమయస్ఫూర్తితో, సామాజిక బాధ్యతతో వ్యవహరించినందుకు వారిని కొనియాడారు. వారు చేసిన సాహసం సమాజానికి ఒక గొప్ప సందేశమని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణలో పౌరులు ఇలాగే అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. నేరాల నియంత్రణలో పోలీసులు ఎంత కృషి చేసినా.. ప్రజల చైతన్యం తోడైనప్పుడే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రజా పోలీస్‌గా మారాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినప్పుడు డయల్ 100 కి గానీ.. హైదరాబాద్ పొలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం అందించాలని సూచించారు.