గ్రీన్ రెడ్ అలర్ట్.. కాసేపు తుఫాన్ ఇన్నింగ్స్, గుజరాత్‌కు ఈజీ టార్గెట్

Wait 5 sec.

ఐపీఎల్ కాస్ట్లీ ఓవర్సీస్ ప్లేయర్ మొత్తానికి ఫామ్‌లోకి వచ్చాడు. రూ. 25.2 కోట్లు పెట్టి మరీ కేకేఆర్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసినా, గ్రీన్ ఇప్పటి వరకు ఆ రేంజ్ ఆట చూయించలేకపోయాడు. కానీ, అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు. తొలుత 14 బంతులకు 8 పరుగులకే చేసినా ఆ తర్వాత పుంజుకుని ఆడాడు. గ్రీన్ 55 బంతుల్లో 79 పరుగులు చేయడంతో కేకేఆర్ 180 స్కోర్ చేయగలిగింది. ఐపీఎల్ 2026లో భాగంగా నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ తనదైన రోజు వస్తే ఎలా ఉంటుందో చూయించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, అందుకు తగ్గ ప్రదర్శన టాప్ ఆర్డర్ చేయలేకపోయింది. కెప్టెన్ అజింక్య రహానే గోల్డెన్ డకౌట్ కావడం, అంగ్‌క్రిష్ రఘువంశీ 8, టిమ్ సైఫర్ట్ 19 పరుగులకే అవుటవ్వడంతో నాలుగు ఓవర్లకే టాప్ ఆర్డర్ మొత్తాన్ని కోల్పోయింది. నాలుగు ఓవర్లలో 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా.. పవర్ ప్లే ముగిసే సమయానికి కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ సమయంలో కామెరూన్ గ్రీన్ - రోవ్‌మన్ పావెల్ ఇద్దరూ కలిసి కేకేఆర్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. ఈ ఇద్దరూ కలిసి 42 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసిన పావెల్ అవుటవ్వడంతో 87 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. పావెల్ అవుటైన తర్వాత గ్రీన్ తన విధ్వంసం మొదలుపెట్టాడు. ఆఖరి ఓవర్లలో ఎలాగైనా పరుగులు రాబట్టాలన్న ఉద్దేశంతో వరుస బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో గ్రీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో గ్రీన్ చేసిన తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. అనుకుల్ రాయ్ - గ్రీన్ కలిసి ఐదో వికెట్‌కు 23 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో అనుకుల్ రాయ్ 7 బంతుల్లో 9 పరుగులు చేయగా, మిగతా స్కోర్ అంతా గ్రీనే బాదేశాడు. అనుకుల్ రాయ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రమణదీప్ సింగ్ 8 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన సునీల్ నరైన్ కూడా 5 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. ఆఖరి ఐదు ఓవర్లలో కేకేఆర్ అనవసరంగా వికెట్లు కోల్పోయింది. 23 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోవడంతో స్కోర్ బోర్డుకు బ్రేక్‌లు పడ్డాయి. చివరి వరకూ క్రీజులో నిలబడిన గ్రీన్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో పరుగులు చేశాడు. దాంతో కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది.