ఇంటికి పారిపోతాడని.. విద్యార్థి కాలికి ఇనుప సంకెళ్లు..

Wait 5 sec.

నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఉన్న ఓ మదరసాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పారిపోతాడనే కారణంతో ఓ బాలుణ్ని గొలుసులతో బంధించారు మదరసాలోని ఉపాధ్యాయుడు. మదరసాలో చదువుకుంటున్న ఓ విద్యార్థి ఇంటికి పారిపోతాడంటూ.. అతని కాలికి ఇనుప గొలుసు బిగించి.. చెక్క మొద్దుకు కలిపి తాళం వేశారు. అయితే ఆ విద్యార్థి మదరసా నుంచి బయటకు వచ్చేశాడు. కాలికి ఇనుప సంకెళ్లతో, చెక్కమొద్దును లాగుతూ వస్తున్న విద్యార్థిని స్థానికులు గమనించారు. ఏం జరిగిందంటూ బాలుణ్ని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్లిపోతానని ఇలా కట్టేశారంటూ ఆ మైనర్ బాలుడు వాపోయాడు.దీంతో మదరసా ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులకు అసలు విషయాన్ని వివరించారు. అనంతరం మదరసా ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. ఏం జరిగిందనేదీ ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుడిని మందలించిన పోలీసులు.. మరోసారి ఇలాంటివి చేయవద్దంటూ హెచ్చరించి పంపించినట్లు తెలిసింది. అయితే మదరసా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పంపించి వేశారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. అయితే సంకెళ్లతో విద్యార్థి రోడ్డుపైకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. స్కూలు నుంచి పారిపోతాడనే కారణంతో మైనర్ బాలుణ్ని ఇలా పశువులను కట్టేసినట్లు బంధిస్తే ఎలా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులను సముదాయించి.. ఊరడిస్తూ విద్యాబుద్ధులు నేర్పించాలని.. ఇలా కర్కశంగా వ్యవహరిస్తే వారి పసి మనసులు గాయపడతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులను బలవంతంగా కాకుండా.. వారికి ఇష్టమైన రీతిలో పాఠాలు బోధించాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.