డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి పోరాటం ఉద్ధృతం.. ప్రధాని మోదీకి లేఖ, లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం

Wait 5 sec.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెంచాలనుకుంటున్న సీట్లలో సగం సీట్లను జనాభా ఆధారంగా.. మరో సగం సీట్లను రాష్ట్రాల జీఎస్‌డీపీ ఆధారంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం.. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలు రిలీజ్ చేయడంతో.. రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని మరింత వేగం పెంచారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి ప్రధానంగా 3 కీలక అంశాలను ప్రస్తావించారు. లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదని లేఖలో వెల్లడించారు. అంతేకాకుండా ప్రక్రియలో దక్షిణ భారత రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని.. ప్రధాని మోదీకి సూచించారు. ఈ డీలిమిటేషన్ అంశంపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో నియోజకవర్గాల పెంపు లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. దాని కోసం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ.. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు.. పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం యోచిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరి.. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుందని ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆందోళనల వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాయడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.