విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఒక్కో జాబ్‌కు రూ.4 లక్షలు.. కోట్లు కొల్లగొట్టిన సంస్థ

Wait 5 sec.

ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరి నిరుద్యోగమే కొందరికి ఆదాయ మార్గంగా మారుతోంది. డబ్బులు తీసుకుని.. ఉద్యోగులు ఇప్పిస్తామంటూ.. అమాయక ప్రజలను నిలువునా దోచుకుని వదిలేస్తున్నారు. ఇలాంటి ముఠాలు పోలీసులకు దొరికే వరకు ఇలా అమాయకులను మోసం చేస్తూనే ఉంటారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడుతున్న పలువురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసిన కొంతమంది వ్యక్తులు.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశచూపి.. భారీ దోపిడీకి పాల్పడుతుండగా అరెస్ట్ చేశారు. గ్రీస్, రొమేనియా వంటి యూరప్ దేశాల్లో భారీ జీతంతో జాబ్స్ ఇప్పిస్తామని నమ్మించి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టి ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ట్రివియల్ చాప్టర్ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ, తెలంగాణ రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నిందితులు పక్కాగా ప్లాన్ చేసి నిరుద్యోగులను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. తొలుత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓవర్సీస్ ఉద్యోగాలు అంటూ యాడ్స్ ఇచ్చేవారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు ఆ యాడ్స్ చూసి.. ఫోన్ చేయగా వారికి మాయమాటలు చెప్పి తమ వలలో పడేసుకునేవారు. రూల్స్ ప్రకారం విదేశాల్లో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం కావాల్సిన ఆర్‌ఏ (RA) లైసెన్స్ లేకపోయినప్పటికీ ట్రివియల్ చాప్టర్ సంస్థను ఒక పెద్ద కన్సల్టెన్సీగా ప్రచారం చేసుకున్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.50 వేలు మొదలుకుని రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇక డబ్బులు ఇచ్చినవారికి ఎలాంటి అనుమానం రాకుండా వారికి నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్‌లను తయారు చేయించి నిందితులు ఇచ్చేవారు. అవి చూసి నిజమైనవని భావించిన నిరుద్యోగులు మిగిలిన మొత్తం కూడా చెల్లించేవారు. ఇక డబ్బు మొత్తం చేతికి అందిన తర్వాత నిందితులు వారితో మాట్లాడటం ఆపేసి.. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోయేవారు. దీంతో అదంతా ఫేక్ అని గుర్తించి.. డబ్బులు చెల్లించి.. చేతిలో నకిలీ ఆఫర్ లెటర్లు పట్టుకుని బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఈ కేసులో మరింత మంది నిందితుల కోసం పోలీసులు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం ట్రివియల్ చాప్టర్ సంస్థ ఫౌండర్, సీఈవో సహా మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సంస్థపై గతంలో కూడా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదైనట్లు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో తేలింది. కేసులు నమోదైనప్పటికీ.. పేరు, ఆఫీస్ అడ్రస్ మార్చేసి.. మళ్లీ అదే దందా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఫేక్ ప్రకటనలు చూసి నిరుద్యోగులు మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.