ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పెళ్లి అయి, పిల్లలు ఉన్న తర్వాత కూడా.. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పెట్టుకుని.. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్న సంఘటనలు పెరిగిపోవడం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఆడ, మగ తేడా లేకుండా భర్త, భార్యలకు తెలియకుండా ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. అవి కాస్తా బయటపడటంతో చంపుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటిదే ఓ ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం శ్రీరామ్‌ నగర్ కాలనీలో అతి కిరాతక ఘటన చోటు చేసుకుంది. భర్తతో గొడవలు కావడంతో.. లక్ష్మీ అనే మహిళ వేరుగా జీవిస్తోంది. ఆమెకు 7 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వీరు ముగ్గురూ కలిసి ఉంటుండగా.. లక్ష్మీకి బీబీపేట మండలానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తితో గతంలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు.అయితే లక్ష్మీ కుమార్తె బాగానే ఉండగా.. కుమారుడికి మాత్రం మానసిక సమస్యలు ఉన్నాయి. దీంతో తన కుమార్తెను తన తల్లి వద్దకు పంపించాలని లక్ష్మీ నిర్ణయించుకుంది. ఇక కుమారుడి అడ్డు తొలగించుకుంటే.. తమ బంధానికి అడ్డు లేకుండా ఉంటుందని వారిద్దరూ భావించాడు. దీంతో 5 ఏళ్ల శ్రావణ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 17వ తేదీన రాత్రి లక్ష్మీ ఇంట్లో లేని సమయంలో ఫూటుగా మద్యం సేవించి వచ్చిన నర్సింహులు శ్రవణ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. శ్రవణ్ కళ్లలో కారం చల్లిన నర్సింహులు.. ఆ తర్వాత కర్రతో తలపై బలంగా కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక నర్సింహులు తన తమ్ముడిపై దాడి చేస్తుంటే.. అడ్డుకునే అతడి అక్క ప్రయత్నం చేసినా అతడు ఆగలేదని తెలిపింది. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింహులును పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే బాలుడి తల్లి కూడా ఈ హత్యకు సహకరించిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.