ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాజమండ్రి-విశాఖపట్నం మధ్యన రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజమండ్రి - విశాఖపట్నం మధ్య రూ.9,889 కోట్లతో 198 కిలోమీటర్ల మేరకు మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్లను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల మీదుగా ఈ రైల్వే ప్రాజెక్టు రానుంది. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పలు పోర్టులకు కూడా అనుసంధానం పెరగనుంది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టులకు అనుసంధానం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై- హౌడా సెక్షన్‌లో ఈ రైల్వే ప్రాజెక్టు చేపడుతున్నారు. రద్దీ కారణంగా ఈ మార్గంలో ఆలస్యం జరుగుతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం.. రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నది మీద మూడు బైపాస్‌లు, 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి, 2.67కి.మీ వయాడక్ట్‌ నిర్మించనున్నారు.కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలుమరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. " ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) మూడు, నాలుగో లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను." అంటూ ట్వీట్ చేశారు.గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల రైలు వంతెనతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా.. రద్దీని గణనీయంగా తగ్గుతుందని, ప్రయాణ సమయాన్ని మెరుగుపరుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపడుతుందని, ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. సరుకు రవాణాను పెంచటంతో పాటుగా పారిశ్రామిక వృద్ధికి, ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి తోడ్పడుతుందని.. అన్నవరం, అంతర్వేది , ద్రాక్షారామం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే భక్తులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగుగా అభివర్ణిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.