హర్మూజ్ జలసంధిలో భారత్‌కు షాకిచ్చిన ఇరాన్.. నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

Wait 5 sec.

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న దాగుడు మూతల యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. హర్మూజ్ జలసంధికి సంబంధించి అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇరాన్ చేస్తున్న ప్రకటనలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించిన ఇరాన్.. మళ్లీ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్‌ జలసంధిని తెరిచిన మరుసటి రోజే మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే హర్మూజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన గన్ బోట్‌లు కాల్పులు జరిపినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అయితే ఆ రెండు నౌకలు భారతీయ జెండాలతో ప్రయాణిస్తున్నట్టు వెల్లడి కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత జెండాలతో హర్మూజ్ జలసంధిని దాటుతున్న రెండు నౌకలపై ఐఆర్‌జీసీ గన్‌ బోట్‌లు జరిపిన కాల్పుల్లో ట్యాంకర్లకు గానీ.. ఆ నౌకల్లో ఉన్న సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేదని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ఈ కాల్పుల ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా హర్మూజ్‌ జలసంధిలో భారత జెండాలతో కూడిన నౌకలపై ఇరాన్ ఐఆర్‌జీసీ చేసిన దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే భారత్‌లో ఉన్న ఇరాన్‌ రాయబారికి.. విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.మరోవైపు.. ఇటీవల అమెరికాతో ఇరాన్ జరిపిన చర్చల సందర్భంగా హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్‌ పోర్టుల చుట్టూ అమెరికా తన సైన్యంతో దిగ్బంధనం చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చమురు రవాణాపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడం గమనార్హం.