ప్రస్తుతం సమాజం ఎంతో అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పెరిగిపోయింది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఇక చాలా రంగాల్లో పురుషుల కంటే మహిళలే ముందు వరుసలో ఉంటున్నారు. పురుషులతో పోటీ పడి తమ సత్తా నిరూపించుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఏదో ఒకరకమైన భారంగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం సమాజం చాలా మారిపోయినప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది ఆడపిల్ల అంటే ఛీత్కరించుకునేవారు కూడా ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందని సంతోషంతో హెలికాప్టర్‌లో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడం.. ఊరంతా భోజనాలు పెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులకు సాయం చేస్తూ.. ఓ గ్రామ సర్పంచ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మల్ జిల్లా అనంతపేట గ్రామ సర్పంచ్ మాదస్తు సునీత.. తన గొప్ప మనసును చాటుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. అనంతపేట సర్పంచ్ మాదస్తు సునీత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అనంతపేట గ్రామంలో ఎవరికైనా ఆడబిడ్డ పుడితే వారికి రూ.5 వేలు.. 2 శ్రీ గంధం చెట్లను బహుమతిగా అందిస్తున్నారు. పుట్టిన ప్రతీ ఆడపిల్లకు భరోసా ఇవ్వడమే తమ లక్ష్యమని మాదస్తు సునీత వెల్లడించారు. ఇక ఆడ బిడ్డల కుటుంబాలకు అండగా నిలుస్తున్న సర్పంచ్ మాదస్తు సునీతను అనంతపేట గ్రామస్తులు అభినందిస్తున్నారు. తమకు ఆడపిల్ల పుట్టిందని భర్తలు.. భార్యలను చంపేవారు.. కోడలిపై అత్తామామలు వేధింపులకు గురి చేసేవారు.. అప్పుడే పుట్టిన పసిపాపను చెత్తకుప్పల్లో పడేసే వారు ఉన్న ప్రస్తుత సమాజంలో ఇలాంటి సర్పంచ్‌లు ఉండటం హర్షనీయమని కొనియాడుతున్నారు.