మరో 10 శాతం పడిపోనున్న బంగారం, వెండి ధరలు.. చమురు ధరలే ప్రధానం కారణం.. నిపుణుల అంచనాలివే!

Wait 5 sec.

Gold Rates Crash: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో బంగారం, వెండి ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరుగుతుండడం, విలువైన ఖనిజాలు సురక్షితమైన మార్గం అనే భావనపై ఒత్తిడి వంటివి బంగారం, వెండి ధరలు పడిపోయేందుకు కారణమవుతున్నాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగానే ధరలను పెంచుతాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయన్న భయాలు, అమెరికా డాలర్ వంటివి బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిపారు. అమెరికా- ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత బంగారం ధరలు 8 శాతం మేర పడిపోయాయి. పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న సిల్వర్ ధరలు సైతం ఒత్తిడికి గురయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి చూసుకుంటే ప్రస్తుతం 16 శాతం మేర దిగువన ట్రేడవుతోంది. కామెక్స్ మార్కెట్లో గత రెండు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు ఈ రోజు కాస్త పెరిగింది. ప్రస్తుతం 4800 డాలర్ల వద్ద ఔన్స్ బంగారం ట్రేడవుతోంది. ఇక కామెక్స్ సిల్వర్ రేటు ఔన్సుకు ఈరోజు 77 డాలర్ల వద్ద ఉంది. హార్ముజ్ జలసంధిని నిర్బంధించిన క్రమంలో ఇరాన్ అధికారులు శాంతి చర్చలకు ముందుకు వచ్చినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటన చేశారు. అలాగే చర్చలు చేపట్టేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ చెప్పినట్లు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్ల దిగువకు పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.2 శాతం పడిపోయింది. దీంతో బంగారం ధరలకు బలం చేకూరింది. దీనివల్ల, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంచవచ్చని లేదా వాటిని మరింత పెంచవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది రాబడినివ్వని ఆస్తులకు ప్రతికూల అంశం. అయితే, ఇంధన సరఫరా అంతరాయాలు, ఆర్థిక ఇబ్బందుల గురించిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్‌పై అమెరికా దిగ్బంధనం ఇరాన్‌పై ఒత్తిడిని తీవ్రతరం చేస్తోంది. ఈ కీలక జలమార్గం ద్వారా ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంత మార్గాల్లోకి నౌకలు ప్రవేశించకుండా నిరోధించడానికి అమెరికా నౌకాదళం కృషి చేస్తోంది. ఉద్రిక్తతలు ఇంకా అధికంగా ఉన్నందున డిసెంబర్ నాటికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనా 20 శాతం కంటే తక్కువగానే ఉందని అమెరికా ద్రవ్య మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.బంగారం, వెండి ధరలు మరింత పడిపోతాయా?కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్ట్ ఏవీపీ కయ్నాత్ చైన్వాలా ఈ విషయంపై పలు అంశాలు వెల్లడించారు. అమెరికా చేపడుతున్న చర్యలు ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల పైకి చేరితే ద్రవ్యోల్బణం భారీగా పెరిగి దానిని కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉందన్నారు. అప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. దీంతో బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాల విలువ మరింత పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అనుకున్నట్లుగా అదే జరిగితే గోల్డ్ రేట్లు భారీగా పడిపోతాయన్నారు. వెండి రేట్లలో మరింత అనిశ్చితి నెలకొంటుందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగినట్లయితే బంగారం, వెండి ధరలు మరో 10 శాతం మేర పడిపోవచ్చని అంచనా వేశారు.