రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.14 వేల సంపాదన.. పోలీసులు, టీచర్లు, వ్యాపారులే టార్గెట్

Wait 5 sec.

మనిషి వద్ద ఉన్న అత్యాశే.. నేరగాళ్లకు పైసా పెట్టుబడి లేని ఆదాయ వనరుగా మారుతోంది. డబ్బుల ఆశ చూపించి.. పెట్టుబడి పెట్టించి.. ఆ తర్వాత కేటుగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా ఆదాయం వస్తుందంటూ నమ్మిస్తూ.. అమాయక ప్రజలను మోసం చేసి.. వారి నుంచి లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో ఒక లక్ష రూపాయులు పెట్టుబడి పెడితే నెలకు రూ.14 వేలు సంపాదించొచ్చంటూ నమ్మబలుకుతూ.. టీచర్లు, వ్యాపారులు, పోలీసులను కూడా మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు అంటూ.. ఫేక్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి మోసగిస్తున్నారు. అంతేకాకుండా నకిలీ యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను పెట్టుబడులు పెట్టిన వారికి ఇచ్చి.. అందులో అకౌంట్లు క్రియేట్ చేసి.. భారీగా లాభాలు కనిపించేలా అంతా మాయ చేస్తున్నారు. మొదట కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెట్టినపుడు.. లాభాలు వస్తే.. వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అది నిజమని నమ్మి.. అత్యాశకు పోయి రూ.లక్షలు, రూ.కోట్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటిని మన అకౌంట్లలోకి విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని తొలగిస్తున్నారు. అంతే కాకుండా ఆ ఫేక్ వెబ్‌సైట్‌ను కూడా మూసేస్తున్నారు. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.ఇక ఈ నెట్‌వర్క్ అంతా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో పనిచేస్తుందని.. ఆ వెబ్‌సైట్‌లలో పెట్టిన పెట్టుబడులు మొత్తం సేఫ్‌గా ఉంటాయని నమ్మిస్తున్నారు. వెబ్‌సైట్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయితే.. అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకోవచ్చని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బిట్‌కాయిన్‌ డిజిటల్‌ కరెన్సీలో పెట్టుబడులు పెడితే.. అతి తక్కువ సమయంలోనే అత్యంత ఎక్కువగా లాభాలు వస్తాయని ఆశ చూపిస్తున్నారు. అయితే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లకు మన దేశంలో అధికారిక అనుమతి లేకపోగా.. అందులో పెట్టుబడులు పెట్టడంపైనా నిషేధం విధించకపోవడంతో సైబర్ ముఠాలు దాన్నే అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మొదట సోషల్ మీడియా వేదికగా యాడ్స్‌తో అమాయకులకు వల విసురుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలు ఇచ్చి.. పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తున్నారు. ఆ తర్వాత ఇతర దేశాల్లోని సైబర్‌ క్రైమ్‌ ముఠాల ద్వారా వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ భారీగా లాభాలు వస్తాయని ఆశచూపించి.. వారిని పూర్తిగా తమవైపు తిప్పుకుంటున్నారు. ఎక్కువగా ఉపాధ్యాయులు, పోలీసులు, వ్యాపారులను నమ్మించి క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టుబడులు పెట్టేలా.. ఆ తర్వాత వారికి తెలిసిన వారితోనూ పెట్టుబడులు పెట్టిస్తే బోనస్‌ కూడా ఇస్తామని ఆశచూపిస్తున్నారు. ఇక మన దేశంలోని యువతకు విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి.. థాయ్‌లాండ్‌కు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత మయన్మార్, కంబోడియా, లావోస్‌ వంటి దేశాలకు తీసుకెళ్లి పాస్‌పోర్టులు లాగేసుకుని.. బలవంతంగా సైబర్‌ క్రైమ్‌ ఉచ్చులోకి దింపుతున్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇక వారు చెప్పేది చేయడం తప్ప ఇంకో దారి లేని వారితో మన తెలుగు రాష్ట్రాల వారికి వాట్సాప్‌ కాల్స్‌ చేయించి ఈ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ సైబర్ దందా సూత్రధారులు మొత్తం చైనాకు చెందిన వారేనని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇలాంటి క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలు బయటికి వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో మెటాఫండ్‌ పేరుతో వందల మంది బాధితుల నుంచి రూ.30 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. ఈ మోసంలో మల్కాజిగిరికి చెందిన లోకేశ్వర్‌ నిందితుడిగా గుర్తించి జైలుకు పంపించారు. మరోవైపు.. జగిత్యాల జిల్లాలో రిక్సోస్‌ ట్రేడ్‌ యాప్‌ పేరుతో ఏకంగా రూ.1500 కోట్లు కొల్లగొట్టారు. గత జనవరి నెలలో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసినవారికి ఫారిన్ టూర్లకు కూడా తీసుకెళ్లారు. ఇక సిరిసిల్ల జిల్లాలో ఈగల్‌కాయిన్‌ పేరుతో రూ.2.25 లక్షల పెట్టుబడి పెడితే రోజుకు రూ.1000 చొప్పున ఇస్తామని నమ్మించి మోసగించారు. మరోవైపు.. రూ.11 లక్షల పెట్టుబడి పెడితే కేవలం ఏడాదిన్నరలోనే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మించి మొత్తం రూ.4.5 కోట్లు కొల్లగొట్టారు. యూబిట్‌ క్రిప్టో పేరుతో నిర్మల్‌ జిల్లాలో ఎక్సైజ్‌ ఎస్సై, మాజీ సైనికుడు, కానిస్టేబుల్, గవర్నమెంట్ టీచర్లను ఎరగా చూపించి రూ.50 కోట్ల వరకు వసూళ్లు చేశారు. జీబీఆర్‌ క్రిప్టో ఫేక్ వెబ్‌సైట్‌ రూ.95 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించి తెలంగాణ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో జనగామకు చెందిన రమేశ్‌గౌడ్‌ను అరెస్ట్ చేశారు.