.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్ర చేస్తానని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. అప్పుడు చేయని పాదయాత్ర ఇప్పుడు ఎందుకు చేస్తానని కేటీఆర్ అంటున్నారని కవిత ప్రశ్నించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎందుకు ప్రజల్లోకి పోలేదని కేటీఆర్‌ను కవిత నిలదీశారు. ఇక హరీష్ రావు కుట్రలు చేస్తారని కవిత ఆరోపించారు. సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ఇచ్చినట్లు తాజాగా శుక్రవారం రోజున జాగృతి కార్యాలయంలో కవిత తెలిపారు. వారంతా తాజాగా కవితను కలిశారు. తెలంగాణలో అన్ని వర్గాలకు అధికారం రావాలి అనేదే తన ధ్యేయమని వెల్లడించారు. తనకు వచ్చే ప్రతీ కష్టాన్ని ఒక పాఠంగా భావిస్తూ.. సామాజిక తెలంగాణ సాధించే వరకు తన పోరాటం ఆపేది లేదని కవిత స్పష్టం చేశారు. 'సర్వోదయ తెలంగాణ' సాధించడమే తన లక్ష్యమని వెల్లడించారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆమె ఆకాంక్షించారు. తమను ఆపే శక్తి లేదని.. ఏదైనా శని ఉంటే దాన్ని తొలగించుకోవడం కోసమే తాను కాశీకి వెళ్లి పూజలు చేసినట్లు కవిత వెల్లడించారు. ఈనెల 25వ తేదీన పెట్టనున్న పార్టీ విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. కొందరు బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని పేర్కొన్న కవిత.. వారి పేర్లు ఇప్పుడే తాను బయటికి వెల్లడించనని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ముందుగా తాను బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశానని.. దీంతో తనను ఆ పార్టీ సస్పెండ్ చేసినట్లు కవిత తెలిపారు.అయితే ప్రజల సమస్యలను తీర్చాల్సింది అధికార పార్టీ అని.. అందుకే కాంగ్రెస్‌ పార్టీని తాను లక్ష్యంగా చేసుకుని పోరాటం చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. అయితే సమస్యల ఆధారంగా బీఆర్ఎస్‌పైన కూడా తాను గళం విప్పుతానని తెలిపారు. పరిగి రైతుల దీక్షకు మద్దతిచ్చేందుకు వెళ్తున్నానని చెప్పి.. హరీష్ రావు హౌస్ అరెస్ట్ అయినట్లు ఆరోపించారు. హరీష్ రావు ఫోన్ చేస్తేనే పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరిగి వెళ్లి తాము రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నామని.. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పోరాటం తరహాలోనే పరిగిలోనూ అదే పోరాటం చేసినట్లు వెల్లడించారు.