తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యువతి మిస్సింగ్ మిస్టరీగా మారింది. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి తిరుమలలోని HVC 694-A గదికి వచ్చారు.. కొంతసేపటికి తిరుపతమ్మ బయటకు వెళ్లింది. ఆమె ఎంతకు తిరిగి రాకపోవడంతో ఆ చుట్టుపక్కల వెతికి చూశారు.. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ఆమెకు పెద్దలు కుదర్చిన పెళ్లి నచ్చక అలిగి వెళ్లినట్లు తిరుమల పోలీసులు చెబుతున్నారు. యువతి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతమ్మ వేకువజామున 3 గంటల సమయంలో గది నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆమె మెరూన్, బ్రౌన్ చుడీదార్ ధరించారని.. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తిరుమల పోలీసులు సూచించారు. యువతి కనిపించకుండా పోయిన గదికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.తిరుపతితో పాటూ జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి సమయంలో నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసుల భద్రతను పెంచారు. ప్రధాన రహదారులపైవిస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి సహా జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇటు హైవేలతో పాటు నగరాలు, గ్రామాలకు ప్రవేశించే మార్గాల్లో కూడా ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీపంలోని స్టేష‌న్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో కూడా పోలీసులు నిఘా పెంచారు.. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.