నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి.. ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంద్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కారుణ్య నియామకాల గురించి తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కారుణ్య నియామకానికి సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లికి చెందిన పెంచలయ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చనిపోయారు.. ఆయన కుమార్తెకు వివాహం కాగా, తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలలో కారుణ్య నియామకాలపై వివరాలు సమర్పించాలని సూచించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కారుణ్య నియామకాలకు సంబంధించి వివరాలు సమర్పించింది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి మొత్తం 20,801మందిని కారుణ్య నియామకాలు జరిగాయని తెలియడంతో హైకోర్టు న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. మూడో తరానికి చెందిన వారు కూడా ఇలా కారుణ్య నియామాకంలో ఉద్యోగంలో చేరిన అంశాన్ని ప్రస్తావించారు. కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలించాని.. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి పరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా మూడు నెలల్లో కారుణ్య నియామకాలకు నూతన మార్గదర్శకాలను రూపొందించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాల్లో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి, కారుణ్య నియామకం బదులు పరిహారం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, టెంపరరీ ప్రాతిపదికన ఉపాధి కల్పించే అంశాలను ప్రస్తావించాలని సూచించింది. చనిపోయిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీసు కాలాన్ని బట్టి పరిహారం చెల్లించాలని సూచనలు చేసింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పిటిషనర్‌ అభ్యర్థనను ఏపీ ప్రభుత్వం పరిశీలించాలన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే కారుణ్య నియామకాన్ని శాశ్వత ప్రాతిపదికన చేపట్టవచ్చన్నారు. ఈ అంశంలో ప్రభుత్వానికే విచక్షణాధికారాన్ని వదిలేస్తున్నామన్నారు. అంతేకాదు ఇలా కారుణ్య నియామకాలతో ఎంతోమంది చదువుకున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశ పెట్టుకున్న యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నారని చెప్పుకొచ్చారు. నిరుద్యోగ యువతపై దయలేదా అని కామెంట్ చేశారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే ప్రాథమికహక్కును ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని ఘాటుగా స్పందించారు. ఉద్యోగి చనిపోయిన సమయంలో సానుభూతితో నియామక ప్రక్రియ దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో కారుణ్య నియామకాలు చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులకు ఉండేదని.. కానీ ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి సోదరులు, తోబుట్టువులు, మేనల్లుళ్లు, మేనకోడళ్ల వరకు వెళ్లిందన్నారు. అందుకే కారుణ్య నియామకాలకు సంబంధించి చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడిన వారు ఎవరో తేల్చేందుకు నిబంధనలు రూపొందించాలి అన్నారు.