: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సోమవారం ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పిటిషనర్ సోషల్ మీడియా వేదికగా కోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.అసలేమిటీ వివాదం?కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్, రాహుల్ గాంధీకి భారత పౌరసత్వంతో పాటు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003లో బ్రిటన్‌లో 'బ్యాక్‌ఆప్స్ లిమిటెడ్' అనే కంపెనీని రాహుల్ స్థాపించారని.. 2005 నుంచి 2006 వార్షిక నివేదికల్లో తన జాతీయతను బ్రిటిష్ అని పేర్కొన్నారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. దీనిపై భారతీయ న్యాయ సంహిత, అధికార రహస్యాల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.న్యాయమూర్తి ఎందుకు తప్పుకున్నారు?గత శుక్రవారం జరిగిన విచారణలో.. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణల్లో ప్రాథమికంగా నిజం ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ విద్యార్థి వ్యాఖ్యానించారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించే ముందు నిందితుడికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను పరిశీలించాలని ఆయన భావించి ఉత్తర్వులను వాయిదా వేశారు. దీనిపై పిటిషనర్ విఘ్నేష్ శిశిర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. కోర్టుపై, న్యాయమూర్తిపై వివాదాస్పద పోస్టులు పెట్టారు. "కోర్టుపై పిటిషనర్‌కు నమ్మకం లేదని ఆయన పెట్టిన మెసేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లడం సముచితం కాదు" అని జస్టిస్ విద్యార్థి పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలను తప్పుబడుతూ ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీకి ఊరట లభించినట్లేనా?న్యాయమూర్తి ఈ కేసు నుంచి తప్పుకోవడంతో.. ఇప్పుడు ఈ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ కానుంది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలోనే ఈ కేసును విచారించే కొత్త న్యాయమూర్తిని నిర్ణయిస్తారు. తొలుత రాయ్‌బరేలీలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో మొదలైన ఈ వివాదం.. పిటిషనర్ కోరిక మేరకు లక్నోకు, ఆపై హైకోర్టుకు చేరింది.