Radisson Hotel New Jobs: ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అనిశ్చితులున్నా.. యుద్ధాలు జరుగుతున్నా.. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ విజయపథంలో దూసుకెళ్తోందని చెప్పొచ్చు. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్‌‌వైపు చూస్తున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు.. తమ వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు.. భారత్‌ను ఎంచుకుంటున్నాయి. గత కొన్నేళ్లలో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పొచ్చు. ఎంచుకుంటున్నాయి. భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు తక్కువ ధరకే లభిస్తుండటం సహా అధిక జనాభా నేపథ్యంలో భారత్‌వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో గ్లోబల్ సంస్థ.. భారత్‌లో తన కార్యకలాపాల్ని వేగంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. అదే బెల్జియం ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ర్యాడిసన్ హోటల్ గ్రూప్. ఇది 2030 నాటికి భారతదేశంలో తన హోటళ్ల సంఖ్యను (ప్రాపర్టీలు) 500 కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మన దేశంలో దాదాపు 65 వేల నుంచి 80 వేల మంది వరకు ఉద్యోగ అవకాశాల్ని కల్పించనున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎలీ యూనస్ వెల్లడించారు. >> ప్రపంచవ్యాప్తంగా తమకు అత్యంత ముఖ్యమైన 3 మార్కెట్లలో భారత్ ఒకటని ఎలీ చెప్పారు. 'ర్యాడిసన్ హోటల్ గ్రూప్‌కు భారత్‌లో ప్రస్తుతం 200 కుపైగా హోటల్స్/ప్రాపర్టీలు ఉండగా.. 2030 కల్లా అంటే మరో నాలుగేళ్లలో దీనిని 500 కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే అవి అప్పటివరకు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే స్థాయిలో ఉండొచ్చు లేదా కొన్ని నిర్మాణ దశలో ఉండొచ్చు. ఏదేమైనా ఈ విస్తరణతో దాదాపు 80 వేల మందికి ఉపాధి కల్పిస్తాం. ఇది ఒక గొప్ప నైపుణ్య అవకాశం.' అని ఆయన వెల్లడించారు. భారత్‌లో కొత్తగా నిర్మించే హోటళ్లలో దాదాపు 15 శాతం 5 స్టార్ హోటల్స్.. 45-50 శాతం వరకు 3 స్టార్ హోటల్స్ లేదా 4 స్టార్ హోటల్స్ ఉంటాయని సంస్థ పేర్కొంది. వీటిల్లో ఎక్కువగా దాదాపు 55 శాతం టైర్- 1 నగరాల్లో ఉంటాయని వెల్లడించింది. 25 శాతం టైర్-2, 3 నగరాల్లో.. ఇంకా 10 శాతం ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉంటాయని.. మరో 10 శాతం రిసార్టులుగా ఉంటాయని తెలిపారు యూనస్.