తెలంగాణ పట్టింది. ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన డిమాండ్ల సాధన కోసం నేడు అర్ధరాత్రి (ఏప్రిల్ 21) నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, రెండో వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో కార్మికులు సమ్మె నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని జేఏసీతో పాటు, గతంలో దూరంగా ఉన్న అశ్వథ్థామరెడ్డి వర్గం కూడా సమ్మెకు మద్దతు తెలపడం గమనార్హం. తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. రవాణా శాఖ మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె తప్పడం లేదని స్పష్టం చేశారు. బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం మొదటి షిఫ్టు నుంచే కార్మికులు విధులను బహిష్కరిస్తారని.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోతాయని వెల్లడించారు. అయితే సమ్మె సైరన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం కాళేశ్వరం పర్యటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ పేద ప్రజల లైఫ్ లైన్ అని.. దానిని ఆగిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల మెజారిటీ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ.. విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరిపి సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని అన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా నిత్యం 35 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. సమ్మె గనుక జరిగితే సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 10 వేల బస్సులు డిపోలకే పరిమితమైతే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సకాలంలో స్పందించి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.