తెలంగాణలో ఇల్లు లేని ఫ్యామిలీలు 38.4 శాతం.. మరుగుదొడ్డి లేని కుటుంబాలు 13.4 శాతం

Wait 5 sec.

తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కులాల జనాభా, వారి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు కళ్లకు కట్టినట్లు బయటికి వచ్చాయి. మౌలిక వసతుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలు చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇల్లు లేని వారిలో ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమగ్ర సర్వేలో తెలంగాణలో ఉన్న కులాల స్థితిగతులు మొత్తం తేటతెల్లం అయ్యాయి. ఓసీలు, బీసీ-సీ వంటి వర్గాలకు తక్కువ సమస్యలే ఉన్నప్పటికీ.. అద్దె ఇళ్లలో జీవిస్తుండటం వారిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 38.4 శాతం కుటుంబాలకు సొంత ఇల్లు లేదని ఈ సర్వేలో వెల్లడైంది. ముస్లింలలో 60 శాతం.. ఓసీల్లో 50 శాతం మంది గూడు లేని వారు ఉన్నారని తేలింది. ఇక 72 శాతం ఎస్టీలు, 70.3 శాతం బీసీ-డీ వర్గాలు ఎక్కువగా సొంతిళ్లలో నివసిస్తున్నాయని గుర్తించారు. ఇక రాష్ట్రంలో ఒకే గది ఇళ్లలో జీవించే కుటుంబాలు 24 శాతం ఉండగా.. వారిలో ఎస్సీలు 30.6 శాతం, ఎస్టీలు 34 శాతం ఉన్నారని వెల్లడైంది. ఇక రాష్ట్రంలో 23.3 శాతం ఫ్యామిలీలకు ఇప్పటివరకు సొంతంగా తాగునీటి కనెక్షన్లు లేవని ఈ సమగ్ర సర్వేలో తేలింది. ఇందులో 32 శాతం ఎస్టీ కుటుంబాలు ఉన్నట్లు తెలిసింది. 9.4 శాతం కుటుంబాలు బజారు నల్లాలపైనే ఆధారపడి తమ అవసరాలను తీర్చుకుంటున్నాయని వెల్లడైంది. ఆ బజారు నల్లా నీటిని తెచ్చుకుంటున్న వారిలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే 12 శాతం ఉన్నాయని తేలింది. ఇక అత్యధికంగా బీసీ-ఈ కుటుంబాల్లో 80.3 శాతం మంది మాత్రమే రక్షిత నీరు పొందుతున్నాయని తెలిసింది. ఇక తెలంగాణలో 5.8 శాతం కుటుంబాలకు సొంతంగా కరెంట్ కనెక్షన్‌లు లేవని తేలింది. వీరిలో 11.1 శాతం ఎస్టీలు.. 8.2 శాతం ఎస్సీలు.. 4.8 శాతం బీసీలు.. 3.9 శాతం ఓసీలు ఉన్నారని వెల్లడైంది. అసలు రాష్ట్రంలోని 13.4 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి లేనే లేదని ఈ సర్వే బట్టబయలు చేసింది. వీరిలో 32 శాతం మంది ఎస్టీలు.. 18.4 శాతం మంది ఎస్సీలు.. 10.9 శాతం మంది బీసీలు ఉన్నారని తెలిసింది. తెలంగాణలోని 8 శాతం కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు లేవని తేలింది. వీరిలో ఎస్టీ 15.7 శాతం, ఎస్సీ 9.7 శాతం, బీసీ 6.8 శాతం, ఓసీ 5.7 శాతం, బీసీ-ఈ 7 శాతం ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 5.4 శాతం కుటుంబాలు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 13.2 శాతం ఎస్టీ.. ఎస్సీ 6.9 శాతం, బీసీ 4.5 శాతం, ఓసీ 2.5 శాతం కుటుంబాలు ఉన్నాయి.