రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో ఎదురుగా పది రూపాయలు కనిపిస్తే ఏం చేస్తాం.. కాస్త ఆగి అటూ, ఇటూ గమనించి ఎవరైనా అక్కడే ఉంటే మీ డబ్బు ఏమైనా పడిపోయి ఉందా అని వివరాలు కనుక్కుని వారికి అందిస్తాం. అదే పది రూపాయల స్థానంలో రూ.500 నోటు ఉంటే.. పరిస్థితులు మారిపోతాయ్. నిజాయితీని పక్కనబెట్టే అవకాశాలే ఎక్కువ. ఎవరి సొమ్ము అయితే నాకేంటి.. దొరికిందే ఛాన్స్ అంటు ఛటుక్కున నోటు తీసి జేబులో వేసేసుకుంటాం. అదే లక్ష రూపాయలు అయితే.. ఎగిరి గంతేస్తాం.. కుదిరితే చిన్న సైజు పార్టీ కూడా చేసుకుంటాం.. కానీ నడిరోడ్డుపై లక్ష రూపాయలు దొరికినా.. ఆ వ్యక్తిలో నిజాయితీ పాళ్లు ఏ మాత్రం తగ్గలేదు. దొరికిన సొమ్మును పోగొట్టుకున్న వాళ్లకు అందించాలని నిర్ణయించుకున్నాడు. సోషల్ మీడియాలో తనకు డబ్బులు దొరికిందనే సంగతిని పంచుకుని.. దానిని చేరాల్సిన వారికి చేరవేశాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండలంలోని గోళ్లమూడి శివాలయంలో రామ్ శర్మ అనే వ్యక్తి అర్చకుడిగా పనిచేస్తున్నారు. రామ్ శర్మ గురువారం రోజు రాత్రి నందిగామ రహదారి మీద వస్తున్న సమయంలో.. ఆయనకు నోట్ల కట్ట రోడ్డుపై కనిపించింది. దగ్గరకు వెళ్లి దానిని తీసుకున్న రామ్ శర్మ.. ఎంత ఉందా అనే లెక్కేస్తే.. రూ. లక్ష ఉన్నట్లు తేలింది. అయితే లక్ష దొరికింది కదా అని సంబరపడలేదు రామ్ శర్మ. పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించాడు. వారు ఏ పరిస్థితులలో ఉన్నారో అని మదనపడ్డారు. తనకు దొరికిన సొమ్మును చేరవేయాల్సిన వారికి చేరవేయాలని నిశ్చయించుకున్న రామ్ శర్మ.. ఎవరైనా డబ్బులు పోగొట్టుకుని ఉంటే.. తనను సంప్రదించండి అంటూ సోషల్‌ మీడియాలో తన వివరాలు పంచుకున్నారు.రామ్ శర్మ ప్రయత్నం ఫలించింది. అతను పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. దీంతో పోయిన డబ్బులు నావేనంటూ రాఘవాపురానికి చెందిన మురళీకృష్ణ అనే గొర్రెల వ్యాపారి.. రామ్ శర్మను సంప్రదించారు. వివరాలను కనుక్కు్న్న రామ్ శర్మ.. నగదు మురళీకృష్ణదే అని నిర్ధారించుకున్నారు. శుక్రవారం రోజున నందిగామ పాత బస్టాండ్ వద్ద మురళీకృష్ణకు రామ్ శర్మ రూ. లక్ష నగదు అందశేశారు. స్థానికంగా ఉన్న వినాయకుడి ఆలయంలో గొల్లమూడి శివాలయం ఛైర్మన్ అర్జునరావు సమక్షంలో రామ్ శర్మ నగదును మురళీకృష్ణకు అందజేశారు.