తెలంగాణలోనూ వాతావరణం విభిన్నంగా మారుతోంది. మండిపోతుంటే.. మరోవైపు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నేడు ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.అయితే.. వర్ష సూచన ఉన్నప్పటికీ . రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నివారం కొమురం బీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీల సెల్సియస్, జగిత్యాల జిల్లా ఉండపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. కాగా, నిప్పుల కొలిమిని తలపించే ఎండలకు తోడు.. వేడి గాలుల ప్రభావం కూడా తోడవడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలపై టోపీ, గొడుగు, కర్చీఫ్ వంటివి ధరించాలని అంటున్నారు. శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవడానికి మంచినీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, రాగి జావ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని.. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఎండల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అంటున్నారు.