తెలంగాణ రైతులకు వరం.. మార్కెట్ ధర ఉన్నప్పుడే అమ్ముకోవచ్చు, సర్కార్ కీలక నిర్ణయం

Wait 5 sec.

తెలంగాణలోని మిర్చి, ఎదురవుతున్న అతిపెద్ద సమస్య స్టోరేజీ లేకపోవటం. పంట కోసిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండటంతో.. మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నా రైతులు నష్టానికి విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు పంట పాడైపోయి పారబోయాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో శీతల గిడ్డంగులు లేని లోటును భర్తీ చేస్తూ.. యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో దీనిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తొలిసారిగా ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో రూ. 10 కోట్ల వ్యయంతో పదివేల టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగిని నిర్మిస్తోంది. ఈ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే రైతులకు అందుబాటులోకి రానుంది. కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పలు జిల్లాల్లో కూడా ఈ కోల్డ్ స్టోరేజీలను నిర్మించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థల సేకరణను ప్రారంభించింది.శీతల గిడ్డంగుల వల్ల రైతులకు అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. మిర్చి, బంగాళాదుంప, ఉల్లి వంటి ఉత్పత్తులతో పండ్లు, పూల ఉత్పత్తులు, చేపలు వంటివి కూడా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు పంటను ఇక్కడ భద్రపరుచుకుని ధర పెరిగినప్పుడు విక్రయించడం ద్వారా రైతులు గిట్టుబాటు ధరను పొందవచ్చు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా వినియోగదారులకు కూడా నిరంతరం తాజా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో నాలుగో ఉద్యాన కళాశాలభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొత్తగా ఉద్యాన కళాశాల ఏర్పాటుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి 30 మంది విద్యార్థులతో బీఎస్సీ ఉద్యాన కోర్సు ప్రారంభం కానుంది. రాజేంద్రనగర్, ములుగు, మోజెర్ల తర్వాత రాష్ట్రంలో ఇది నాలుగో ఉద్యాన కళాశాల కానుంది. ఉద్యాన పంటలకు పేరొందిన భద్రాద్రి జిల్లాలో ఈ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు శాస్త్రీయ మెళకువలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.