హైదరాబాద్ నగరవాసులకు నిజంగా ఇది సూపర్ న్యూస్. మహానగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని మధ్యతరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించటం, ట్రాఫిక్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా అనే తేడా లేకుండా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మక ప్రాతిపదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ పథకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అధికార యంత్రాంగం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఈ పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే, ఉచిత ప్రయాణం వల్ల పెరిగే ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా, రైల్వేకు వచ్చే ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. కోవిడ్‌కు ముందు రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణించే ఎంఎంటీఎస్‌లో ప్రస్తుతం సరైన ఫ్రీక్వెన్సీ లేకపోవడం వల్ల ఆ సంఖ్య 40 వేల లోపుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చొరవతో మళ్లీ ఎంఎంటీఎస్‌కు పూర్వ వైభవం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా.. ఎంఎంటీఎస్‌ సేవలలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచడం, సమయపాలన పాటించడం, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పించేందుకు రైల్వే స్టేషన్ల నుంచి నివాస ప్రాంతాలకు ఆర్టీసీ షటిల్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో బస్సులకు స్థలం కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వేను కోరింది.ఈ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. పథకం అమలుకు సంబంధించి ముసాయిదా ఎంవోయూ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని, అయితే రైళ్ల ఫ్రీక్వెన్సీ, సమయాలను రైల్వే శాఖే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 491.45 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ గుర్తు చేసింది. ఈ నిధుల విడుదల, ఎంవోయూ ప్రక్రియ పూర్తయితే జూన్ నుంచి హైదరాబాద్ వాసులకు ఉచిత రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.