ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని ముస్లింల అభివృద్ధికి, విద్యా వికాసానికి వెచ్చించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తలీమ్‌-ఇ-హునార్‌ అనే పథకాన్ని ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఏటా 500 మంది ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నారు.ఈ పథకం పూర్తిగా వక్ఫ్ బోర్డు నిధులతో అమలు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను మైనారిటీ సంక్షేమ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఒక మెరిట్ పరీక్ష (టాలెంట్ టెస్ట్) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమకు నచ్చిన కార్పొరేట్ కళాశాలను ఎంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఎంపికైన విద్యార్థులకు పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఒక్కో విద్యార్థి చదువు, వసతి కోసం ఏడాదికి సుమారు రూ. 2 లక్షల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. విద్యార్థుల ప్రగతిని వక్ఫ్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.దాంతో పాటుగా.. వక్ఫ్ బోర్డు స్థలాల్లో నడుస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో కూడా ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదరు కళాశాలల నుంచి వసూలు చేసే అద్దెకు బదులుగా ఆ మొత్తానికి సమానమైన విలువ గల విద్యను ముస్లిం విద్యార్థులకు ఉచితంగా అందించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే గుత్తిలోని ఎస్వీ కళాశాలలో 60 మంది విద్యార్థులకు ఈ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచే తలీమ్‌-ఇ-హునార్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ముస్లిం యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మే 21 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఇది అమల్లోకి రానుంది. పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులెవరైనా తమ మార్కులను మెరుగుపరుచుకోవచ్చు. థియరీ పేపర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఏప్రిల్ 20 నుండి 27 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఈ నిర్ణయం విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుందని బోర్డు భావిస్తోంది.