తెలంగాణలో పౌర విమానయాన రంగాన్ని విస్తరించడమే కాకుండా, ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కొత్తగూడెం జిల్లాల్లో విమానాశ్రయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియట్‌లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఈడీ రాజ్‌కిశోర్, విమానయాన శాఖ సంచాలకుడు భరత్‌రెడ్డిలతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. సాంకేతిక అనుమతులు పూర్తి చేసి వీలైనంత త్వరగా దీనికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక , రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయని దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను తక్షణం సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఇక్కడ భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందని హామీ ఇచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి గతంలో ప్రతిపాదించిన స్థలం అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొన్న నేపథ్యంలో.. మంత్రి కీలక సూచనలు చేశారు. ఆ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణంపై మరింత లోతైన అధ్యయనం చేయాలని ఇతర ప్రత్యామ్నాయాలు, సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ, మౌలిక వసతుల ఏర్పాటులో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విమానాశ్రయాల ఏర్పాటుతో ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడి, పారిశ్రామిక వృద్ధికి బాటలు పడతాయని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటు కోసం ఏవియేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు.