ఐపీఎల్‌లో ఇలాంటి డబుల్ హెడ్డర్ మళ్లీ మళ్లీ రాదేమో. ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడే మూడు టీమ్స్ ఈరోజే ఆడుతున్నాయి. దాంతో ఐపీఎల్ అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ రోజు డబుల్ హెడ్డర్‌లో తలపడుతున్నాయి. వీకెండ్స్ కావడంతో శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్ నిర్వహించేలా ఐపీఎల్ ప్లానింగ్ చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 18న అంటే ఈ రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుండగా.. రాత్రి 7 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడుతున్నాయి. ఒక మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగుతుంటే, మరో మ్యాచ్ ఉప్పల్‌లో జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌‌లో ఆర్సీబీ - ఢిల్లీ జట్లు ఢీకొంటున్నాయి. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు ఆడి రెండు ఓడి, రెండు గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన ఢిల్లీ.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. దాంతో ఈ మ్యాచ్ ఆ జట్టుకు కీలకంగా మారింది. ఇక రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్ చాలా స్పెషల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సీఎస్కే, ఆఖరి రెండు మ్యాచ్‌లలో బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఫామ్‌లోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ప్రత్యర్థులను భయపెట్టేందుకు సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచి, మూడు ఓడింది. సీఎస్కే కూడా మూడు ఓడి, రెండు గెలిచింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతుండగా, సీఎస్కే 8వ స్థానంలో ఉంది.