ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం పథకాలను అమలు చేస్తోంది.. వారి ఆర్థిక ప్రగతి కోసం స్త్రీ నిధి రుణాలను మంజూరు చేస్తోంది. డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలతో పాటుగా స్త్రీ నిధి రుణాలను తీసుకుని ఉపాధి పొందుతున్నారు.. ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. ఏపీ ప్రభుత్వం గత రెండేళ్లలో రెండుసార్లు స్త్రీ నిది రుణ పరిమితిని పెంచింది. గతంలో ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.3.50 లక్షల వరకు స్త్రీ నిధి రుణం మంజూరుచేయగా.. ప్రభుత్వం ఆ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచింది. రెండోసారి ఆ పరిమితిని రూ.8 లక్షలు చేసింది. ఈ రుణాల్లో డ్వాక్రా సంఘంలోని సభ్యురాలు ఒక్కొక్కరికి కనిష్ఠంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ రుణం అందుతుంది.ఏపీలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో రూ.5 లక్షలు మాత్రమే స్త్రీ నిధి రుణాలు మంజూరుచేశారు. దీంతో ఒక్కో సభ్యురాలికి రూ.50 వేలు మాత్రమే రుణం అందింది. ఈ రుణం సరిపోకపోవడంతో వారి వ్యాపారాల కోసం అవసరమైన రుణం కోసం బయట అప్పులు చేశారు. అయితే ప్రభుత్వం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ.8 లక్షల రుణం మంజూరు చేసే అవకాశం కల్పించడంతో ఊరట దక్కింది. ఈ నిర్ణయంతో డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ. లక్ష వరకు రుణం పొందవచ్చు. అర్హులైన వారు ఈ రుణం తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాదు స్త్రీ నిధి రుణాలు చెల్లింపులకు సంబంధించి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్రీనిధి పేమెంట్‌ యాప్‌‌ను తీసుకురావడంతో రఉనాలు చెల్లింపు సులభతరం అయ్యింది.డ్వాక్రా సంఘం తీర్మానంతో డీఆర్డీఏ-వెలుగు కార్యాలయం ద్వారా ఈ స్త్రీ నిధి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత కేవలం రెండురోజుల్లోనే రుణాన్ని మంజూరు చేస్తారు. ఒక్కో డ్వాక్రా సంఘం గరిష్ఠంగా రూ.8 లక్షలు వరకు రుణం తీసుకోవచ్చు. వందశాతం గ్రామసమాఖ్య ప్రాతిపదికన సంఘం సభ్యులందరికీ రుణం అందుతుంది. స్త్రీనిధి ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లో డ్వాక్రా మహిళలు ఫోన్ నంబర్‌, సంఘం పేరు, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది.. అనంతరం రుణాలను చెల్లించొచ్చు. గతంలో కొన్నిచోట్ల నిధులు పక్కదారి పట్టడంతో రికవరీ యాప్ ద్వారా మాత్రమే స్త్రీ నిధి రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాల పరిమితిని రూ.8 లక్షలకు పెంచింది.. ఒక్కొక్కరికి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తుంది.