మహిళా రిజర్వేషన్లకు సంబంధించి.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన దీంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే ఈ వ్యవహారంపై ఇవాళ కేంద్ర మంత్రివర్గం భేటీ అయి చర్చించింది. ఈ కేబినెట్ భేటీలో.. ప్రతిపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని.. దీనికి తగిన పర్యవసానాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాల నిరసనల మధ్య.. ఈ కీలక మహిళా బిల్లు పార్లమెంటులో వీగిపోయిన తర్వాతి రోజే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించడం కారణంగా విపక్షాలు తప్పనిసరిగా వాటికి పర్యవసానాలను ఎదుర్కోవాలని పేర్కొన్నారు. దేశ మహిళలకు సమాధానం చెప్పుకోవాలని కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ అన్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని.. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో మహిళలకు 2029 నుంచే 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో నెగ్గాలంటే రెండొంతుల మెజారిటీ అవసరం కాగా.. శుక్రవారం రోజున ఓటింగ్ నిర్వహించారు. గురువారం ప్రారంభమైన సుదీర్ఘ చర్చ శుక్రవారం రాత్రి వరకు సాగిన తర్వాత జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా.. 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో 2/3వ వంతు మెజార్టీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ బిల్లు వీగిపోవడంతో.. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ఓడించి ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ దేశంలోని మహిళలు గమనిస్తున్నారని.. ఈ ద్రోహాన్ని ఎప్పటికీ వారు మరిచిపోరని వ్యాఖ్యానించారు.