ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Wait 5 sec.

తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలిదశ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు (L-1) ఇప్పటికే మొదటి విడతలో నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు స్థలాలు లేని నిరుపేదలకు (L-2) సైతం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గణాంకాల ప్రకారం.. గతంలో 18,816 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 10,353 ఇళ్లు పూర్తయ్యాయి. అయితే వీటిలో సుమారు 5 వేల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు 3550 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న మొత్తం 8 వేలకు పైగా ఇళ్లను స్థలాలు లేని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించనుంది.డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ స్థితిలో ఉన్నా అంటే బేస్‌మెంట్, స్లాబ్ లేదా ఫినిషింగ్ దశలో వాటిని లబ్ధిదారులకు అప్పగిస్తారు. ఒకవేళ నిర్మాణం అసంపూర్తిగా ఉంటే.. లబ్ధిదారులే స్వయంగా ఆ పనిని పూర్తి చేసుకునేలా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. దీనికోసం గతంలో గుత్తేదారులతో ఉన్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసింది. జీ ప్లస్ పద్ధతిలో ఉన్న సముదాయాలను లబ్ధిదారుల నేతృత్వంలోని కమిటీలు పర్యవేక్షించి, నిర్మాణ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.చాలా చోట్ల మౌలిక వసతులు లేక ఈ ఇళ్లు వృథాగా మారాయి. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద వీటిని కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు కేటాయించే వీలుంటుంది. లబ్ధిదారులు సొంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం వల్ల నాణ్యతతో పాటు, వేగంగా ఇళ్లు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏవరైనా పాత కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.ఇక ఇందరిమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. మెుత్తం 4 విడతల్లో ఈ డబ్బులు అకౌంట్లలో జమ చేస్తున్నారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు మంజూరు చేయగా.. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక రెండో దశ లబ్ధిదారుల ఎంపికకు రేవంత్ సర్కార్ కసరత్తు మెుదలుపెట్టింది.