యాసంగి ధాన్యంపై కీలక ముందడుగు.. బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం అంగీకారం..!

Wait 5 sec.

యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు.దేశవ్యాప్తంగా ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు.బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇక 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బయ్యారంలో గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయండిసీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. బయ్యారంలో గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలోనే ఉన్న ఆయన.. ఇవాళ కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మను కలిశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ద్వారా ఉక్కు కొరత తగ్గడంతోపాటు.. పర్యావరణానికి మేలు జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. పాత వాహనాల స్క్రాప్‌ను రీసైక్లింగ్‌ చేసే పరిశ్రమను సైతం తెలంగాణలో ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యం లేని నగరంగా మార్చేందుకు సహకరించాలని కేంద్రమంత్రులను విజ్ఞప్తి చేశారు.