: ఇటీవలి కాలంలో ఉద్యోగం ఉండటమే కష్టంగా మారింది. ముఖ్యంగా ఆర్థిక మందగమనం సహా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలా కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు చూస్తున్నాయి. దీంతో లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించేశాయి. అమెజాన్, ఒరాకిల్, యూపీఎస్, స్నాప్ సహా ఇంకెన్నో కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించుకున్నాయి. ఒరాకిల్ ఏకంగా ఒకేసారి 30 వేల మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెజాన్ కూడా 10 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. వెల్లడించింది.>> ఇప్పుడు ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఈ సంవత్సరంలో భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపుగా 8 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ వర్గాల్ని ఉటంకిస్తూ పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.ముందుగా మెటా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరందరినీ ఒకేసారి కాకుండా విడతల్లో తొలగించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తొలి దశలో 10 శాతం వర్క్‌ఫోర్స్‌ అంటే సుమారు 8 వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. రెండో విడత కింద మరికొంత మంది ఉద్యోగుల్ని ఈ ఏడాది చివర్లో తొలగించేందుకు ప్రణాళికలు రచించనున్నట్లు తెలిపింది. తర్వాత ఎప్పుడు.. ఎంత మందిని తొలగిస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇదే జరిగితే గనుక 2022-23 తర్వాత కంపెనీ చేపట్టనున్న అతిపెద్ద తొలగింపులు ఇవే కానున్నాయి. 2022 ఆఖర్లో 11 వేల మందికి సంస్థ లేఆఫ్స్ ఇచ్చింది. తర్వాత ఏడాదిలో మరో 10 వేల మందిని విధుల్లో నుంచి తొలగించింది. ప్రస్తుతం మెటా ఏఐ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది. దీంట్లో భాగంగానే 2028 కల్లా డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 600 బిలియన్ డాలర్ల మేర వెచ్చించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇటీవల కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది.