పిఠాపురం వర్మ ఆ సంగతి మర్చిపోయారా.. మీపై గుసగుసలు వినిపిస్తున్నాయి: ముద్రగడ కుమార్తె క్రాంతి

Wait 5 sec.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం రేగింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పీఏడీఏ (PADA) కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో జనసేన నేతలు తుమ్మలబాబు, .. దొరబాబు వర్మపై దూసుకెళ్లారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా ఈ ఎపిసోడ్‌పై ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె, జనసేన పార్టీ నేత క్రాంతి స్పందించారు. వర్మ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదని.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దగ్గర నుంచి ఆయన వైఖరి వింతగానే ఉందన్నారు. ఏదో రకంగా రచ్చ చేయడమే మీ పనిగా కన్పిస్తోందన్నారు. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీలో ఫోటోల గురించి రగడ సృష్టించడం ఏమిటండి? అంటూ ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో పవన్ కళ్యాణ్ రూ.600కోట్ల అభివృద్ధి పనులు పిఠాపురం నియోజక వర్గంలో చేపట్టారని.. ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారన్నారు. అయినా చీటికీ మాటికీ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేలా వర్మ ప్రవర్తన ఉందని.. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత, ఎన్డీయేలో భాగస్వామి అనే విషయం మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఇలా వ్యవహరిస్తే దాని అర్ధం ఏమనుకోవాలన్నారు క్రాంతి. ఇప్పటికీ వర్మ గురించి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారని.. కూటమిలో చిచ్చు పెట్టేలా వర్మవ్యవహారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహారం కనబడుతోందని.. ఏమైనా తేడాలుంటే, మీ పార్టీలో మాట్లాడుకోవాలి కానీ, ఇలా వ్యవహరించి, వార్తలకు ఎక్కడం సబబు కాదని హితవు పలికారు. ఇప్పటికైనా తీరు మార్చుకోండి అంటూ సలహా ఇచ్చారు క్రాంతి.