'నాకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి, MLA పదవికి రాజీనామా చేస్తా'.. ప్రభుత్వ విప్ కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

ప్రభుత్వ విప్, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై అక్రమ మైనింగ్, స్టోన్ క్రషన్ కార్యకలాపాలకు సంబంధించి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. క్రషర్ వ్యాపారంలో తనకు వాటా ఉందని ఎవరైనా నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాను ఒకప్పుడు కార్యకర్తగా ఉండి.. ఆ స్థాయి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‍గా ఎదిగినట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్యే పదవి రాకముందు నుంచే బిజినెస్ చేసినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణల వేళ.. సోమవారం మీడియాతో మాట్లాడిన బీర్ల అయిలయ్య.. తాను వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడిని అంటూ చెప్పారు. తనకే చాలా ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలా అక్రమ దందాలు చేసి సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదని వెల్లడించారు. తాను పది రూపాయలు సంపాదిస్తే.. అందులో 9 రూపాయలు పేద ప్రజల కోసమే ఖర్చు చేస్తానని వివరించారు. అంతేకాకుండా తన భూములనే ఇతరులకు దానం చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అక్రమ సంపాదన అవసరం లేదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండలంలో ఉన్న చల్లూరు గుట్టలో అక్రమ మైనింగ్‌, స్టోన్‌ క్రషర్‌ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని.. బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇందులో బీర్ల ఐలయ్య పాత్ర ఉందని ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్‌పై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఆరోపణలపై స్పందించిన బీర్ల ఐలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక అంతకుముందు చల్లూరులోని 322 సర్వే నంబర్ భూముల్లో జరుగుతున్న క్రషర్ కార్యకలాపాలపై చర్చకు రెడీ అంటూ బీర్ల అయిలయ్య చేసిన సవాల్‌కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సవాల్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన కల్లూరి రామచంద్రారెడ్డి.. ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ఆ క్రషర్ వద్దే బహిరంగ చర్చ నిర్వహిద్దామని పేర్కొన్నారు. బీర్ల అయిలయ్యకు ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆయన ఒక తేదీని ఖరారు చేస్తే అదే రోజున చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టర్‌తోపాటు.. మైనింగ్ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టుల సమక్షంలో ఆ చర్చ జరగాలని డిమాండ్ చేశారు.రాత్రింబ‌వ‌ళ్లు చల్లూరులో అక్రమంగా పేలుళ్లు జరుగుతున్నాయని.. అయినప్పటికీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియాలో తాము ప్రశ్నిస్తే.. కేసులు పెడతామని బెదిరింపులకు దిగడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తక్షణమే ఆ క్రషర్ కార్యకలాపాలను ఆపేసి.. ఘటనపై సమగ్ర విచారణ చేయడం ద్వారా బీర్ల అయిలయ్య తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.