ఏపీ ప్రజలకు APSDMA హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌‌లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఎండతీవ్రత, మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనావేస్తున్నారు. ఇవాళ 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 17 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉంది. నేడు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.ఆదివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 279 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం కర్నూలు జిల్లా నగరడోనలో 45.4 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 44.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా కరపలో 44.4 డిగీల్ర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వాన పడింది. సాయంత్రం వరకు ఎండలు, ఆ తర్వాత వర్షాలు పడ్డాయి.మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఎల్‌నినో ఏర్పడటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు ఆలస్యంగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు వర్షపాతం తగ్గడంతో పాటుగా వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుంది అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నాయి.. ఏపీలో ఏకంగా 200కుపైగా మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అంతేకాదు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ఎండలతో పాటుగా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం అవుతాయంటున్నారు.. జూన్ వరకు ఎండలు, ఉక్కపోత వాతావరణం కొనసాగవచ్చు అంటున్నారు.