ఎస్సీ యువతకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్.. రూ.3 లక్షలకు రూ.70 వేలు కడితే చాలు..!

Wait 5 sec.

తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా.. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సోలార్, పశుసంపద రంగాల్లో వినూత్న అవకాశాలను కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద సుమారు 10 వేల మందికి పైగా యువతకు లబ్ధి చేకూర్చేలా రూ.219 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. వచ్చే వారం నుండి జిల్లా స్థాయిలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.మారుతున్న రవాణా రంగ అవసరాలను గుర్తిస్తూ.. యువతకు తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం వచ్చేలా ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) అందించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ-కామర్స్ డెలివరీ సంస్థలు, లాజిస్టిక్స్ వ్యాపారాల్లో రాణించడానికి ఇవి ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. 5,016 మందికి టూ వీలర్ ఈవీలను అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేయడం విశేషం. ఒక్కో యూనిట్ విలువ రూ.లక్షగా నిర్ణయించారు. అలాగే, ప్రజా రవాణా కోసం రూ.3 లక్షల విలువైన త్రీ వీలర్ ఈవీలను 2,508 మందికి పంపిణీ చేయనున్నారు. వీటి సరఫరా కోసం తయారీదారుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించిన ప్రభుత్వం.. ఈ నెలాఖరుకల్లా సంస్థలను ఖరారు చేయనుంది.సాగునీటి సౌకర్యం లేక బీడుపడిన ఎస్సీ రైతుల భూములను సాగులోకి తెచ్చేందుకు 'ఇందిర గిరిజల వికాసం' తరహాలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వ్యయంతో 500 మందికి సోలార్ పంపుసెట్లను అందించనున్నారు. దీనివల్ల విద్యుత్తు కనెక్షన్, బోరుబావుల సమస్య తీరి భూములు సస్యశ్యామలం కానున్నాయి. అదనంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పశుసంపద పథకం కింద 2,473 యూనిట్లను సిద్ధం చేశారు. ఈ పథకాల్లో లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటించింది. రూ. లక్ష వరకు విలువైన యూనిట్లకు 90 శాతం సబ్సిడీ ప్రకటించగా.. రూ. 1 - 2 లక్షల మధ్య ఉండే యూనిట్లకు 80 శాతం సబ్సిడీ, రూ. 2 - 4 లక్షల లోపు యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ప్రకటించారు. రూ. 4 లక్షల పైన ఉన్న యూనిట్లకు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ప్రకటించారు. మరోవైపు, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలోని ఐటీడీఏ మైదాన ప్రాంతాల్లోని 10,500 మంది గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 'ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన' తరహాలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోని యువతను ఎంపిక చేయాలని ఇప్పటికే ఐటీడీఏ పీవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. మే 1 నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.