మాడు పగిలే ఎండలు.. ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతాల జాబితాలోకి ఆదిలాబాద్

Wait 5 sec.

తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎంతలా అంటే ఆదిలాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించిన ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది. సోమవారం (ఏప్రిల్ 20) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి నమోదైన నగరాల్లో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే కొత్తగూడెంలో 43.3, గద్వాల 43.3, నిర్మల్ 43.0, నిజామాబాద్ 43.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉండటం.. వేడికి నెలవైన మహారాష్ట్ర విదర్భ సరిహద్దులో ఉండటం వల్ల మధ్య భారతం నుంచి వచ్చే పొడి, వేడి గాలులు ఇక్కడ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గడం కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గిందని వెల్లడించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్ల సహజసిద్ధమైన చల్లదనం తగ్గి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందని అంటున్నారు.కేవలం ఆదిలాబాద్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్‌లోని కొత్తపేట వంటి పట్టణ ప్రాంతాలు కూడా గ్లోబల్ హీట్ లిస్టులో చేరిపోతున్నాయి. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉండటం, భూగర్భ జలాలు పడిపోవడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ట్రాప్ అవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌ సరూర్‌నగర్ సర్కిల్‌లోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్, ముషీరాబాద్‌ ప్రాంతంలో 41.6 డిగ్రీల సెల్సియస్, అంబర్‌పేట 41.4. మల్కాజిగిరి 41.3, ఎల్బీనగర్, 41.3, మెహదీపట్నం 41.1 డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నప్పటికీ.. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో సాయంత్రం వేళల్లో గాలివాన కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది. అయితే ఎండ తీవ్రత మాత్రం 40-45 డిగ్రీల మధ్యే కొనసాగే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.