ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రోజు రికార్డుస్థాయిలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని విపత్తుల నిర్వహణం సస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉంది అన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరంలో 19, పార్వతీపురం మన్యంలో 14, అల్లూరి సీతారామరాజు 1, పోలవరం 4, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 1 కలిపి 46 మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తాయన్నారు. అయితే మరో 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో 44. 2 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43 డిగ్రీలు. అనంతపురం జిల్లా రాయదుర్గంతో పాటు పల్నాడు జిల్లా దుర్గి, శ్రీసత్యసాయి జిల్లా తలుపులలో 42.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ఎండ.. మరోవైపు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోయారు. ఈ నెల 18వరకు రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వేడి గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసేవారు ఉదయం 11 గంటలలోపే ఇళ్లకు రావాలని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, బాలింతలు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎవరైనా అత్యవసరమై బయటకు వెళితే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయటకు వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు.