మొన్న హైదరాబాద్.. ఇవాళ ముంబై.. దేశం మొత్తం తిరిగేస్తోన్న ధోనీ!

Wait 5 sec.

ఈ ఐపీఎల్‌లో మిస్టరీ పర్సన్‌గా మారాడు. ధోనీ కోసమే మ్యాచ్‌లకు వచ్చే ఎంతో మంది అభిమానులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. . కానీ ధోనీ మాత్రం ప్లేయింగ్ 11లోకి రాకుండా.. డగౌట్‌కే పరిమితమవుతున్నాడు. తాజాగా ముంబై చేరుకున్న ధోనీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే గాయం కారణంగా కొద్ది రోజులు పక్కకు తప్పుకున్న ధోనీ, ఇప్పటి వరకు మళ్లీ జట్టులోకి రాలేదు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. సీఎస్కే టీమ్‌తో కలిసి హైదరాబాద్‌కు రావడంతో మ్యాచ్‌లో ఆడటం పక్కా అనే అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా ధోనీ ఆడతాడనే ఉద్దేశంతో టికెట్లు ఎగబడి కొనేశారు. సీన్ కట్ చేస్తే ప్లేయింగ్ 11లో ధోనీ పేరే లేదు. సన్‌రైజర్స్‌పై ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు ముంబైతో తలపడనుంది. సీఎస్కే తన తరువాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్ 23న వాంఖడే వేదికగా జరగనుంది. ముంబై చేరుకున్న సీఎస్కే ప్లేయర్లతో పాటు ధోనీ కూడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో అయినా ధోనీ ఆడతాడనే ఆశతో అభిమానులు ఉన్నారు. మోకాలి కండరాల సమస్యతో బాధపడిన 44 సంవత్సరాల ధోనీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ధోనీ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌నెస్ సాధించాడు. కానీ, ధోనీ మ్యాచ్ ఆడేదీ, లేనిదీ మెడికల్ టీమ్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాతే తెలుస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌కి జట్టు ప్రయాణించిన ధోనీ.. ముంబై ఇండియన్స్‌పై కచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడని అనుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కీలక బ్యాటర్ ఆయుష్ మాత్రే తొడ కండరాల గాయంతో మూడు వారాల పాటు జట్టుకు దూరమయ్యాడు. ముంబైలో స్కాన్స్ తర్వాత రీ ఎంట్రీ ఎప్పుడు అనే విషయం తెలుస్తోంది. దాంతో మాత్రే బయటకు వెళ్లడంతో ధోనీ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత రెండేళ్లుగా ఆఖర్లో బ్యాటింగ్‌కి వస్తున్న ధోనీ.. ఈ సారి ముందు వరుసలో ఆడాలనే వాదన కూడా వినిపిస్తోంది. ధోనీ క్రీజులో ఉన్నంత సేపూ హిట్టింగ్ చేయనుండటంతో సీఎస్కేకి స్కోర్ కూడా పెరుగుతుందని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. మొత్తానికి ముంబై చేరుకున్న ధోనీని వాంఖడేలో సీఎస్కే జెర్సీలో చూడాలని ఫ్యాన్స్ ఉబలాటపడుతున్నారు.