ప్రేమలో పడిన అమ్మాయిలు ప్రియుడి కోసం ఏమైనా చేస్తారను అనడానికి నిదర్శనం ఈ ఘటన. ఓ అమ్మాయి తన తండ్రి దగ్గర నమ్మకంగా పని చేసే వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు చెప్పిన మాటల్ని నమ్మింది. కష్టాలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే కరిగిపోయింది. ప్రియుడిని కాపాడుకోవడం కోసం ఇంట్లో నుంచి ఒక కిలో బంగారం తీసి అతడికి ఇచ్చేసింది. బంగారం కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ఏరియాలో గుజరాత్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. సాగర్ అనే 34 ఏళ్ల యువకుడు అతడి దగ్గర నాలుగేళ్లుగా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. నమ్మకంగా పని చేస్తూ ఇంట్లో ఒకరిలా కలిసిపోయాడు. దీంతో యజమానితోపాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అతడిని బాగా చూసుకునే వారు. ఈ క్రమంలోనే అతడు యజమానికి కూతురికి దగ్గరయ్యాడు. ఆమెతో స్నేహంగా మెలుగుతూ దగ్గరయ్యాడు.సాగర్‌కు అప్పటికే పెళ్లయ్యి ఒక పాప కూడ ఉండటం.. ఇంట్లో ఒకడిలా చూసుకుంటుండటంతో యజమానికి అతడి ప్రవర్తన పట్ల అనుమానం రాలేదు. యజమాని కూతురితో స్నేహం పెరిగిన తర్వాత.. ఆమె తన పట్ల ఇష్టం చూపుతోందని.. తన మాటలను పూర్తిగా నమ్ముతోందనే నమ్మకంగా కలిగాక సాగర్ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు.తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని.. ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ కథలు చెప్పడం మొదలుపెట్టాడు. అతడు చెబుతున్న తీరుకు ఆమె మనసు విలవిల్లాడింది. తనకు ఇష్టమైన వ్యక్తి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా..? ఆ సమస్యలు తీరే మార్గం లేదా? అని అనుకుంది. అతడి సమస్యలకు పరిష్కారం చూపే మార్గాన్ని తానే చూపాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఇంట్లో నుంచి ఏకంగా ఒక కిలో బంగారాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి అతడికి ఇచ్చేసింది.యజమాని కూతురు తెచ్చి ఇచ్చిన బంగారంలో కొంత భాగం అమ్మేసిన సాగర్.. అప్పులు తీర్చేశాడు. తన సమస్యలు తీర్చేసిన ఆ దేవతకు థ్యాంక్స్ చెప్పాడు. మిగిలిన డబ్బుతో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి లైఫ్ స్టయిల్ మొత్తం మార్చేశాడు.అయితే యజమాని కుటుంబ సభ్యులు గుజరాత్‌లోని తమ సొంతూరు వెళ్లాలని భావించారు. అందుకోసం ఇంట్లో లాకర్లో దాచిన బంగారు ఆభరణాలను పరిశీలిస్తుండగా.. కిలో బంగారం తగ్గింది. దీంతో ఆ యజమాని ఏప్రిల్ 17న చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. సదరు వ్యాపారి కుమార్తె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆమెను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె చెప్పిందంతా విన్న పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర్నుంచి 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు.