పిఠాపురం కూటమి పార్టీల్లో తాజా ఫ్లెక్సీ వివాదం పెద్ద దుమారమే రేపింది.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దొరబాబు చేసిన స్కామ్‌లు బయటపెడతానని వర్మ కామెంట్ చేస్తే.. వర్మ చీకటి బాగోతాలు తాను బయటపెడతానంటూ దొరబాబు కౌంటరిచ్చారు. తాజాగా దొరబాబుకు కౌంటర్‌గా వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదని ప్రశ్నించినందుకు తనపై, టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్మ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈరోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కోవర్టుగా దొరబాబు పనిచేస్తూ కూటమిలో తగాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదని ప్రశ్నించినందుకు తనపై కలబడి, టీడీపీ కార్యకర్తల్ని బయటకు తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు వర్మ. పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను ఎందుకు వేయడం లేదంటూ ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవమానం జరిగితే ఊరుకునేది లేదన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అవమానం జరిగినా ఊరుకునేది లేదన్నారు.. ఎందుకంటే ఆయన్ను తామంతా కలిసి గెలిపించుకున్నామన్నారు. దొరబాబు ఎన్నికల సమయంలో కూటమికి వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదని చెప్పిన సమయంలో.. పాడా కమిషనర్ ఫోటో విషయంలో తప్పు జరిగిందని చెప్పడంతో వివాదం ముగిసిందన్నారు వర్మ. కానీ ఇంతలో దొరబాబు వచ్చి తనను నెట్టేసి, మీద పడ్డారని.. కూటమి ధర్మం పాటిస్తూ.. చంద్రబాబుపై గౌరవంతో తాము ఏం మాట్లాడటం లేదన్నారు. ప్రతి సమావేశంలో చంద్రబాబు ఫోటో ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ బలమైన పార్టీ, పార్టీ అధినేత చెబితే వినే పార్టీ.. చంద్రబాబు వంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర పెరిగాం కాబట్టి మర్యాదగా ఉంటున్నామన్నారు. తాను దొరబాబు చేసిన స్కామ్‌లు మొత్తం బయటకు తీస్తానన్నారు. ఆ స్కామ్‌లు బయటపడకుండా జాగ్రత్త పడేందుకు పార్టీ మారారన్నారు వర్మ.పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పీఏడీఏ (PADA) కార్యాలయంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫోటోను ఎందుకు లేదని పాడా కమిషనర్‌ను ప్రశ్నించారు.. ఈ క్రమంలో జనసేన పార్టీ నేతలు బాబు, పెండెం దొరబాబు.. టీడీపీ నేత వర్మ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో దొరబాబు వర్మపైకి దూసుకురావడంతో నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన తర్వాత నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.