Crash: భారత్‌లోనే మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు బుధవారం సెషన్‌లో (ఏప్రిల్ 22) భారీగా పతనం అయ్యాయి. కిందటి రోజు ఏప్రిల్ 21న ఈ ఐటీ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి) ఫలితాల్ని వెల్లడించగా.. ఇది అంచనాల్ని అందుకోలేకపోయింది. బలహీనమైన ఫలితాలు, బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాలు సహా డీల్స్ తగ్గడం, ఐటీ రంగంలో మందగమనం వంటివి స్టాక్ పతనానికి దారి తీస్తున్నాయి. ఫలితాల తర్వాత పలు బ్రోకరేజీలు కూడా స్టాక్ టార్గెట్ ప్రైస్ భారీగా తగ్గించాయి. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఈ దిగ్గజ ఐటీ స్టాక్ ఏకంగా 10 శాతం వరకు పతనమై ఇన్వెస్టర్లకు తీరని నష్టాల్ని మిగులుస్తోందని చెప్పొచ్చు. కిందటి సెషన్‌లో మంగళవారం రోజు హెచ్‌సీఎల్ టెక్ షేర్ ధర రూ. 1441.20 వద్ద ముగియగా.. ఇవాళ నేరుగా 7 శాతం వరకు తగ్గి రూ. 1345 వద్ద ఓపెన్ అయింది. తర్వాత రూ. 1358 వద్ద గరిష్ఠాన్ని తాకినా.. అక్కడి నుంచి వరుసగా పతనం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక దశలో స్టాక్ ధర దాదాపు 10 శాతం పడిపోయి రూ. 1300.10 వద్ద సెషన్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 10.30 గంటలకు ఇదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్ మార్కెట్ విలువ రూ. 3.53 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1780.10 కాగా.. కనిష్ఠ ధర రూ. 1297.70 గా ఉంది. గత కొంత కాలంగా ఐటీ స్టాక్స్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంటున్న తరుణంలో ఇవాళ ఇలా పతనం అవడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు పెరిగాయి. ఇతర ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే ఇవాళ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 4 శాతం తగ్గగా.. టీసీఎస్ 2 శాతం వరకు తగ్గింది. విప్రో, ఎల్ అండ్ టీ ఒక శాతం పతనం అయ్యాయి. ఐటీ రంగంలో మందగమనంతో.. ఇంకా పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి తొలగకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. 4.2 శాతం పెరిగి రూ. 4,488 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 12 శాతం పెరిగి రూ. 33,981 కోట్లుగా నమోదైంది. అయినప్పటికీ అంచనాల్ని అందుకోలేకపోవడంతో జేపీ మోర్గాన్, HSBC, నోమురా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలా అన్ని బ్రోకరేజీలు టార్గెట్ ప్రైస్‌ తగ్గించేశాయి. దీంతో స్టాక్ ధర భారీగా పతనమైంది. ఇక భారత స్టాక్ మార్కెట్ సూచీల విషయానికి వస్తే ప్రస్తుతం సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 78,580 స్థాయిలో ఉండగా.. నిఫ్టీ 200 పాయింట్ల పతనంతో 24,380 వద్ద కొనసాగుతోంది. గమనిక: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.