తెలంగాణలో మొదలైంది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతి నుంచి సమ్మె ప్రారంభించారు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కలేదు. దీని ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. అసలే వేసవి, ఆపై ప్రజా రవాణాలో కీలకమైన బస్సులు లేకపోవడంతో.. గమ్య స్థానాలకు చేరుకోవడానికి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇంతకూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి కారణాలేంటి? తెలంగాణ ఏర్పాటయ్యాక వారు ఎన్నిసార్లు సమ్మె చేపట్టారో తెలుసుకుందాం.సమ్మె చేపట్టడానికి కారణాలు..ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, వేతన సవరణ చేపట్టాలి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనేవి ప్రధానమైన డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అదే తరహాలోనే ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రవాణా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోలుగా గుర్తించాలని కోరుతున్నారు. సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని.. కారుణ్య నియామకాలు చేపట్టాలని.. కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన పీఎఫ్, సొసైటీ నిధులను ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లించాలని.. పదవీ విరమణ బెనిఫిట్స్‌ను సకాలంలో అందజేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.ఆర్టీసీ మనుగడకు కీలకమైన డ్రైవర్లు, కండకర్లపై ఒత్తిడి తగ్గించేలా డ్యూటీలు వేయాలని.. 8 గంటల పనిదినం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతోపాటు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. చెకింగ్ అధికారుల వేధింపులు తగ్గించాలని.. అద్దె బస్సుల సంఖ్యను తగ్గించి సొంత బస్సులను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా నిలిచిపోయిన కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించి.. గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించాలి. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. ఆర్టీసీ బస్సులకు డీజిల్ సబ్సిడీ అందించాలి. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న ప్రభుత్వం.. దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు.విశ్రాంతి గదులను ఆధునికీకరించాలని.. వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని.. సమ్మె కాలంలో తొలగించిన ఉద్యోగులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కూడా ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది.బుధవారం తెల్లవారుజాము నుంచే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ వారం క్రితమే ప్రకటించింది. అయినా సరే ప్రభుత్వం వెంటనే చర్చలకు సిద్ధం కాలేదని.. హడావుడిగా మంగళవారం సాయంత్రం .. వారిని చర్చలకు ఆదేశించిందని కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించిన ఈ కమిటీ డిమాండ్ల పరిష్కారానికి నాలుగు వారాల సమయం కావాలని కోరగా.. దానికి కార్మిక సంఘాలు అంగీకరించలేదు. దీంతో బుధవారం నుంచి ఆర్టీసీ సమ్మె మొదలైంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. .తెలంగాణ వచ్చాక రెండుసార్లు సమ్మె..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ సిబ్బంది గతంలో రెండుసార్లు సమ్మె చేపట్టారు. వేతన సవరణ చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో 2015లో 8 రోజులపాటు సమ్మె చేశారు. ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో సమ్మెను విరమించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 52 రోజులపాటు 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సుదీర్ఘ సమ్మె చేశారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో చివరకు ఎలాంటి లిఖితపూర్వక హామీ లేకుండా కార్మికులు విధుల్లో చేరారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టినప్పటికీ కాంట్రాక్టు డ్రైవర్లు, అప్పటికప్పుడు సమకూర్చుకున్న డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో ప్రభుత్వం కొన్ని బస్సులను నడిపింది.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..రాష్ట్రంలో ప్రస్తుతం 3100 అద్దె బస్సులు ఉన్నాయి. వీటితోపాటు 500 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ యథావిధిగా రోడ్లు ఎక్కుతాయి. తాతాల్కికంగా సిబ్బందిని నియమించుకొని, వారి సాయంతో మరో 2 వేల బస్సులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే సగం బస్సు సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.అయితే గతంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మహాలక్ష్మీ పథకం వల్ల ఆర్టీసీలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 35 లక్షల నుంచి 60 లక్షలకు చేరింది. ఇంత మందికి సాధారణ రోజుల్లో ఉన్న ఆర్టీసీ సర్వీసులే సరిపోవడం లేదు. అలాంటిది సగం సర్వీసులు ఎలా సరిపోతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఆర్టీసీ సమ్మె చేపట్టిన సమయంలో ఆటోలు, ట్యాక్సీలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా వారు ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. దీని వల్ల ప్రయాణికులపై భారం పడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉంది.సమ్మె ఎప్పుడు ముగుస్తుంది..?ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ముగుస్తుంది అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు కచ్చితమైన సమాధానం చెప్పలేం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారి డిమాండ్ల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తక్కువ సమయంలోనే సమ్మె ఆగిపోవచ్చు. కానీ ప్రభుత్వం గనుక 2019 తరహాలో కఠిన వైఖరిని అవలంబిస్తే మాత్రం చాలా రోజులపాటు సమ్మె కొనసాగుతుంది. అయితే రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకూ ఉద్యోగులు, కార్మికుల విషయంలో సానుకూల ధోరణినే కనబరుస్తోంది. కాబట్టి ఇలా జరిగే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.