తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చకులు స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు ఏకాంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఈ ద్వారాల గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. మొదటగా ప్రముఖులకు (వీఐపీలు) దర్శనం కల్పించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయంలో సీఎంకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వామివారిని దర్శించుకున్నారు.ఆ తర్వాత, ఉదయం 6 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభమైంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కొనసాగుతుంది. జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు.. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మొదటి మూడు రోజులు.. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో, కోసం టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతిస్తారు. ఈ టోకెన్లను టీటీడీ కేటాయించింది. భక్తులు తమ ఆధార్ కార్డుతో పాటు, టీటీడీ ఇచ్చిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలి. మంగళవారం ఉదయం, శ్రీవారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. బుధవారం ద్వాదశి పండుగ సందర్భంగా, తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. వచ్చే టోకెన్లు లేని భక్తులకు జనవరి 2 నుంచి 8 వరకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వివిధ సమయాల్లో వచ్చే భక్తులను వేర్వేరు ప్రవేశ మార్గాల ద్వారా అనుమతిస్తారు. టోకెన్ పొందిన వారికి, ఎస్‌ఈడీ, శ్రీవాణి టికెట్లు ఉన్నవారికి, స్థానికులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. మంగళవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్ టోకెన్ తీసుకున్న భక్తులను కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి లోపలికి పంపుతారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్‌లో ఉన్నవారిని ఏటీజీహెచ్‌ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా భక్తులు ఆలయంలోకి వెళ్లవచ్చు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను వారికి కేటాయించిన సమయాల్లో, కోటా ప్రకారం అనుమతిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5వేల మంది చొప్పున ఈ-డిప్‌ ద్వారా టోకెన్లు ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే.