: బ్యాంకు ఖాతాదారులు తక్కువ మొత్తాల్లో నగదు విత్ డ్రా కోసం (ఏటీఎం)లు ఉపయోగిస్తారు. అలాగే బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ తనిఖీ చేయాలన్నా, మినీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నా ఏటీఎం ద్వారా పూర్తి చేయవచ్చు. ఇతర బ్యాంకింగ్ సేవలు సైతం ఏటీఎం ద్వారా పొందవచ్చు. ఏటీఎం అంటే అది ఒక మినీ బ్యాంక్ మాదిరి అని చెప్పవచ్చు. అయితే, అలాంటి ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)నే వెల్లడించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎవరు చూసినా స్మార్ట్ ఫోన్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు వినియోగం భారీగానే తగ్గిందని చెప్పవచ్చు. చిన్న చిన్న ట్రాన్సాక్షన్ల నుంచి పెద్ద ట్రాన్సాక్షన్ల వరకూ యూపీఐ ద్వారానే పూర్తి చేస్తున్నారు. దీంతో ప్రజలు నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఉపయోగించే ఏటీఎంల సంఖ్య తగ్గుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 2025, మార్చి 31 నాటికి దేశంలో మొత్తం ఏటీఎంల సంఖ్య 2,51,057కు తగ్గిపోయినట్లు వెల్లడించింది. 2024, మార్చి నెల చివరి నాటికి దేశంలో మొత్తం ఏటీఎంలు 2,53,417గా ఉండగా అది 2025, మార్చి 31 నాటికి 2,51,057కు పడిపోయింది. అంటే ఏడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 2,360 ఏటీఎంలను బ్యాంకులు తొలగించాయి. ప్రైవేట్ రంగంలోని బ్యాంకులకు చెందిన ఎటీఎంల సంఖ్య 79,884 నుంచి 77,117కు తగ్గిపోయింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంల సంఖ్య 1,34,694 నుంచి 1,33,544కు దిగివచ్చింది. మరోవైపు.. (ప్రైవేట్ కంపెనీల అధీనంలోని ఏటీఎంలు) మాత్రం భారీగానే పెరిగాయి. 2024 మార్చి చివరి నాటికి 34,602 వైట్ లేబుల్ ఏటీఎంలు ఉండగా ఆ సంఖ్య ఏడాదిలో 36,216కు పెరిగింది. అంటే 1614 ఏటీఎంలు పెరిగాయి. అలాగే ఇదే ఏడాది కాలంలో దేశంలో బ్యాంకు బ్రాంచీల సంఖ్య 2.8 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో బ్యాంకు శాఖల సంఖ్య 1.64 లక్షలుగా ఉంది. అయితే బ్యాంకు బ్రాంచీల సంఖ్య పెరిగినప్పడు ఏటీఎంల సంఖ్య సైతం పెరగాలి, కానీ అందుకు భిన్నంగా కార్యక్రమం నడుస్తోంది. అంతే డిజిటల్ చెల్లింపుల ప్రభావమేనని బ్యాంకింగ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.