కుప్పకూలిన వెండి ధర.. గంటలో రూ.21 వేలు పతనం.. ఒక్క కారణంతో ఢమాల్

Wait 5 sec.

: ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఫ్యూచర్ మార్కెట్లో వెండి రేటు ఒక్కసారిగా ఢమాలాని కిందకు పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్ వెండి రేటు కిలోకు గంటలోనే ఏకంగా రూ.21 వేలు మేర తగ్గింది. జీవన కాల గరిష్ఠాల నుంచి వెండి రేటు కుప్పకూలింది. కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశం. సోమవారం ఇంట్రాడేలో రూ. 2,54,174 వద్ద గరిష్ఠ స్థాయిని తాకిన కిలో వెండి రేటు ఆ తర్వాత రూ. 2,33,120 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. స్పాట్ మార్కెట్‌లోనూ వెండి రేటు భారీగా దిగివచ్చింది. భౌగోళిక అనిశ్చితుల కారణంగా కొద్ది రోజులుగా బంగారం, వెండికి భారీ డిమాండ్ ఏర్పడింది. వెండి ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్ల దిగువనే ట్రేడవుతూ వచ్చిన వెండి ఒక్కసారిగా దూసుకెళ్లి కంగారు పెట్టింది. సోమవారం ట్రేడింగ్‌లో ఒక దశలో కిలో వెండి రేటు 80 డాలర్లు దాటడం గమనార్హం. అయితే, గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కి దిగడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం అంశంలో కీలక అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉక్రెయిన్ ప్రెసిడెండ్ జెలెన్ స్కీ భేటీ అయ్యారు. ఆ తర్వాత శాంతి ఒప్పందంపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్, జెలెన్ స్కీలు సుముఖంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో యుద్ధానికి తెరపడనుందన్న అంచనాల వేళ వెండి ధర దిగివచ్చింది. వెండి రేటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 181 శాతం మేర పెరిగింది. జీవన కాల గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా వెండి రేటు పతనానికి కారణమైనట్లు విశ్లేషకలు చెబుతున్నారు. వెండిలో అమ్మకాల ఒత్తిడికి చికాగో మర్చంట్ ఎక్స్ఛేంజీ సైతం మరో కారణంగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రూప్‌లో ప్రపంచంలోని అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీలను నిర్వహిస్తోంది. 2026 మార్చి ఫ్యూచర్ కాంట్రాక్టు మార్జిన్ 20 వేల డాలర్ల నుంచి 25 వేల డాలర్లకు పెంచింది. దీంతో ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగి వెండి రేటు పడిపోయినట్లు అనలిస్టులు పేర్కొంటున్నారు.