తెలంగాణ రాష్ట్రంలో కోసం ఉన్నత విద్యా మండలి 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. రాబోయే మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయం, వైద్యం, న్యాయశాస్త్రం వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలోనే నిర్వహిస్తారు.పరీక్షల ప్రయాణం మొదలయ్యేది ఇలా.. ఈ పరీక్షల పరంపర మే 4వ తేదీన ప్రారంభమవుతుంది. మొదటి రెండు రోజులు అంటే మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు టీజీ ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం ఇచ్చి.. మే 9 నుండి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈఏపీ సెట్ పరీక్ష బాధ్యతను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) చూసుకోనుంది.వరుసగా ఇతర ప్రవేశ పరీక్షలు.. ఇంజినీరింగ్ పరీక్షలు ముగిసిన వెంటనే మే 12వ తేదీన ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడే వారి కోసం ఎడ్‌సెట్ పరీక్ష ఉంటుంది. ఎంబీఏ, ఎంసీఏ వంటి నిర్వహణ కోర్సుల్లో చేరాలనుకునే వారి కోసం మే 13, 14 తేదీల్లో ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఇక పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు వీలుగా మే 15న ఈసెట్ పరీక్ష జరుగుతుంది. న్యాయ విద్య చదవాలనుకునే అభ్యర్థుల కోసం మే 18న లాసెట్, పీజీ ఎల్ సెట్ పరీక్షలను ఒకే రోజు పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి సాంకేతిక విద్య కోసం మే 28 నుండి 31 వరకు పీజీ ఈసెట్ నిర్వహిస్తారు. చివరగా శారీరక విద్యపై ఆసక్తి ఉన్న వారి కోసం పీఈసెట్ పరీక్షలను మే 31న మొదలుపెట్టి జూన్ 3వ తేదీతో ఈ ప్రవేశ పరీక్షల క్రతువును ముగిస్తారు.ప్రవేశ పరీక్షల తేదీలు ముందుగానే రావడం వల్ల విద్యార్థులకు తమ ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి మంచి సమయం దొరికినట్లయింది. పరీక్షకు కనీసం మూడు నెలల ముందు నుండే నోటిఫికేషన్లు విడుదలవుతాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ఎందుకంటే కౌన్సెలింగ్ సమయంలో ఇవి చాలా కీలకం.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) కాబట్టి.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కనీసం రెండు, మూడు మాక్ టెస్టులు రాస్తే పరీక్ష సమయంలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్ మార్కులే కాకుండా.. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంకు ఆధారంగానే మంచి కళాశాలలో సీటు లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు చదువుకు కేటాయించాలి. గత ఏడాది ప్రశ్న పత్రాలను సాధన చేయడం వల్ల పరీక్ష సరళిపై అవగాహన పెరుగుతుంది. ను అభ్యర్థులు క్రమం తప్పకుండా చూస్తుంటే పరీక్ష కేంద్రాల మార్పు లేదా హాల్ టికెట్ల డౌన్‌లోడ్ వంటి తాజా సమాచారం లభిస్తుంది.ఈ పరీక్షలు ముగిసిన వెంటనే జూన్ లేదా జూలై నెలల్లో ఫలితాలు విడుదల చేసి.. ఆగస్టు నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభమై విద్యార్థులకు పాఠ్యాంశాలు పూర్తి కావడానికి తగిన సమయం దొరుకుతుంది.