తెలంగాణ శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుద్ధరణ గురించి మాట్లాడారు. గుజరాత్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే.. అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారని అన్నారు. అందుకోసం దాదాపు 60 వేల కుటుంబాలను తరలించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ గంగానది ప్రక్షాళనకు వేలాది మందిని తరలించారని పేర్కొన్నారు. ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామంటేనే బీజేపీ వాళ్లు గెలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే తాము కూడా మూసీ ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ పాజెక్టును దశల వారీగా చేపట్టనున్నట్లు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదట దశలో 21 కిలోమీటర్లు..మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి దశలో 21 కిలోమీటర్లు మేర పనులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు తొలి దశ మూసీ నది అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2026 మార్చి 31 కల్లా తొలి దశ పనులు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. కాగా, సంక్రాంతిలోగా మొదటి దశ డీపీఆర్‌పై.. స్పష్టత ఇస్తామన్నారు. కాగా, నాబార్డ్ నుంచి తీసుకున్న రూ.4,100 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 51 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్లు..గండిపేట నుంచి గౌరెల్లి వరకు.. మొత్తం 51 కిలోమీటర్ల మేర మూసీ నది అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అదే విధంగా 51 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. కాగా, మీర్‌ఆలం ట్యాంక్‌ కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని.. ఈ ట్యాంక్‌పై రూ. 450 కోట్లతో బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు.. తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పారు సీఎం రేవంత్. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందని.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాని వెల్లడించారు. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందని సీఎం నొక్కి చెప్పారు. ఇక జలవనరులను కలుషితం చేసి, కబ్జాలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించారని.. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారని ప్రతిపక్షాలపై రేవంత్ మండిపడ్డారు. అందుకే ఆ డ్రైనేజీలను కూలగొట్టి, కబ్జాలపై చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.