నిజంగా సిగ్గుచేటు.. సర్ఫరాజ్ ఖాన్‌‌కి అన్యాయంపై గంభీర్, అగార్కర్‌పై వెంగ్‌సర్కార్ ఫైర్

Wait 5 sec.

భారత జట్టు సెలక్షన్ కమిటీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, అలాగే టీమ్ మేనేజ్‌మెంట్ తీరుపై భారత మాజీ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం రాణిస్తున్న సరఫరాజ్ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లలో పక్కన పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.జైపూర్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో గోవాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 75 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 పరుగులు చేశాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై జట్టు 400 పరుగుల మార్క్‌ను సునాయాసంగా దాటింది. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన దిలీప్ వెంగ్‌సర్కార్ సర్ఫరాజ్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు.“అతను దేశవాళీ క్రికెట్‌లోనే కాదు, భారత జట్టుకు అవకాశం ఇచ్చినప్పుడల్లా రాణించాడు. అయినా ఒక్క ఫార్మాట్‌లో కూడా అతనికి అవకాశం ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న ఆయన, ఆ మ్యాచ్‌లో సర్ఫరాజ్–పడిక్కల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. “అంత ముఖ్యమైన ఇన్నింగ్స్ తర్వాత కూడా అతనికి మరో టెస్టు అవకాశం రాకపోవడం బాధాకరం” అని వ్యాఖ్యానించాడు.2024–25 బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా టూర్‌కు సర్ఫరాజ్ ఎంపికైనప్పటికీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వకపోవడం నిజంగా సిగ్గుచేటు అని వెంగ్‌సర్కార్ మండిపడ్డాడు. అన్ని ఫార్మాట్లలో ఆడగలిగే ప్రతిభ కలిగిన ఆటగాడని, ఇలాంటి టాలెంట్‌ను నిర్లక్ష్యం చేయడం నిజంగా దురదృష్టకరమని బాధపడ్డాడు.రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన హోం సిరీస్‌లో సరఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 6 టెస్టుల్లో 371 పరుగులు చేశాడు. సగటు 37.10 కాగా, స్ట్రైక్ రేట్ 74.94గా ఉంది. ఒక సెంచరీ, మూడు అర్ధశతకాలతో అతని గణాంకాలు బలంగా ఉన్నాయి. అయినా సరే, జాతీయ జట్టులో సర్ఫరాజ్‌కు అవకాశాలు ఇవ్వకపోవడంపై ఇప్పుడు మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.