న్యూ ఇయర్ పార్టీలో ఘోరం.. బార్‌లో భారీ పేలుడు, 40 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు!

Wait 5 sec.

స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్‌ మోంటా స్కీ రిసార్ట్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన భారీ పేలుడులో 10 మందికి పైగా మరణించారు. ఫేమస్ 'లే కాన్స్టెలేషన్' బార్‌లో జరిగిన ఈ ప్రమాదంలో అనేకమంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. బాణసంచా పేలడమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తుండగా.. దీనిపై స్విస్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. జనవరి 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఒక లగ్జరీ బార్‌లో సంభవించిన ఈ పేలుడు.. కొత్త ఏడాదిలో పెను విషాదాన్ని మిగిల్చింది.కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ అక్కడికి వచ్చిన వారంతా వేడుకల్లో మునిగిపోయి ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే చుట్టూ మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలో బార్‌లో 100 మందికి పైగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది ఇప్పటివరకు మరణించారని పోలీసులు ధృవీకరించారు. అయితే స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 40 వరకు ఉండవచ్చని సమాచారం. ఇక ఈ ప్రమాద తీవ్రత చూస్తుంటే.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనలో వంద మందికి పైగా గాయపడగా.. వారిని తరలించేందుకు అనేక హెలికాప్టర్లను అధికారులు రంగంలోకి దించి ఎమర్జెన్సీగా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఆ బార్‌లో జరిగిన పేలుడుకు గల కచ్చితమైన కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. అయితే.. ఆ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఉపయోగించిన బాణసంచా వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.పేలుడు జరిగిన బార్ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. క్రాన్స్‌ మోంటా మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. బాధితుల బంధువుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.