తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామం నేడు ఒక అద్భుతమైన మార్పుకు వేదికైంది. గ్రామాల్లో కలుషిత నీటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఒకవైపు, పెరిగిన ధరలు మరోవైపు సామాన్యులను ఇబ్బంది పెడుతున్న తరుణంలో.. ఆ గ్రామ సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. నూతన సంవత్సర కానుకగా ఆమె ఆచరణలో పెట్టారు. సాధారణంగా మార్కెట్‌లో పదిహేను నుండి ఇరవై రూపాయల వరకు ఉంటుంది. అయితే గ్రామస్తుల సంక్షేమం దృష్ట్యా.. స్థానిక ప్లాంట్ నిర్వాహకులతో చర్చలు జరిపి పది రూపాయలకే క్యాన్(20 లీటర్ల వాటర్) ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ పది రూపాయలలో ఐదు రూపాయలను సర్పంచ్ తన సొంత ఆదాయం నుండి భరిస్తున్నారు. తద్వారా ప్రతి ఇంటికి కేవలం ఐదు రూపాయలకే స్వచ్ఛమైన నీరు అందుతోంది. ఈ పథకం ఆమె పదవీ కాలం ముగిసే వరకు కొనసాగుతుందని హామీ ఇవ్వడం గమనార్హం.ఈ చొరవ వల్ల గ్రామంలోని సుమారు 300 నుండి 500 కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతోంది. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, టైఫాయిడ్, కలరా వంటి నీటి ద్వారా వ్యాపించే రోగాల నుండి పేద ప్రజలకు రక్షణ లభిస్తుంది. ఆర్థికంగా చూస్తే.. ప్రతి నెలా ఒక కుటుంబానికి తాగునీటిపై అయ్యే ఖర్చులో దాదాపు 70 శాతం వరకు ఆదా అవుతుంది.కేవలం నీటికే పరిమితం కాకుండా.. రామన్నపల్లెలో మానవీయ విలువలకు పెద్దపీట వేస్తున్నారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే.. వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని సర్పంచ్ కుటుంబం అందిస్తోంది. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా.. వ్యక్తిగత నిధులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామం ఒక రోల్ మోడల్‌గా మారుతోంది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణపురం శ్రీనివాస్, ఇతర గ్రామ పెద్దలు పాల్గొని.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.