Multibagger: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే షేరు ధర పెరిగినప్పుడే లాభం వస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించిన వారికి ఇతర బెనిఫిట్స్ సైతం ఉంటాయి. కేవలం స్టాక్ ధర పెరగడమే కాకుండా బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్, డివిడెండ్, షేర్ల బైబ్యాక్ అంటూ ఇలా కంపెనీ తన మూలధన లాభాల నుంచి ఆఫర్స్ ఇస్తుంటుంది. దీంతో ఇన్వెస్టర్లు అదనంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా అదనపు ప్రయోజనం పొందుతారు. అందుకే స్టాక్ మార్కెట్ లోనూ దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఓ కంపెనీ బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. తమ వాటాదారుల వద్ద ఉన్న షేర్ల సంఖ్యను భారీగా పెంచుతోన్న కంపెనీ ఏ-1 లిమిటెడ్ (A-1 Ltd). ఈ కంపెనీ కొద్ది రోజుల క్రితమే బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని మొదట డిసెంబర్ 22గా నిర్ణయించగా దానిని డిసెంబర్ 31వ తేదీకి మార్చింది. అంటే ఏ-1 లిమిటెడ్ కంపెనీ స్టాక్ డిసెంబర్ 31వ తేదీన ఎక్స్ బోనస్, ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహిస్తుంది. అందుకు ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 30వ తేదీ మార్కెట్లు ముగిసే నాటికి ఈ కంపెనీలో షేర్లు కొన్న వారికి మాత్రమే అర్హత లభిస్తుంది. అంటే ఈరోజు షేర్లు కొన్నవారికి బంపర్ ఆఫర్ దక్కుతుంది. కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ ప్రకారం 3:1 రేషియోలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే 1 షేరుకు అదనంగా 3 షేర్లు వస్తాయి. దీంతో మొత్తం 4 షేర్లుగా మారతాయి. అలాగే కంపెనీ 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటన చేసింది. దీని ప్రకారం 1 ఈక్వీటీ షేరు 10 షేర్లుగా విభజిస్తారు. అంటే బోనస్ ఇష్యూ తర్వాత 4 షేర్లు ఉంటాయి కాబట్టి ఒక్కో షేరు 10 షేర్లుగా మారుతుంది. ఉదాహరణకు మీరు డిసెంబర్ 30 రోజున ఏ-1 లిమిటెడ్‌కు చెందిన 100 షేర్లు కొనుగోలు చేసి ఉన్నట్లయితే అప్పుడు అవి స్టాక్ స్ప్లిట్, బోనస్ ప్రకారం ఏకంగా 4000 షేర్లు అవుతాయి. అయితే, స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ తర్వాత షేరు ధర సైతం భారీగా తగ్గుతుంది. ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సిన పని లేదు. స్టాక్ ధర తగ్గడం అనేది సాంకేతికంగా జరిగే ప్రక్రియ, కానీ పెట్టుబడిలో ఎలాంటి మార్పు ఉండదు. ఎలాంటి లాభమూ, నష్టమూ ఉండదు. అయితే, ఎక్స్ బోనస్, స్ప్లిట్ ట్రేడింగ్ తర్వాత స్టాక్ పనితీరు ఆధారంగా ఈ లాభనష్టాలు ఆధారపడి ఉంటాయని గమనించాలి.